తనతో శారీరక సంబంధం పెట్టుకోకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించిన ఓ కీచక ప్రొఫెసర్ అలాగే విద్యార్థినిని ఫెయిల్ చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
రాజస్థాన్ : ఓ ప్రొఫెసర్ నీచానికి దిగజారాడు. మంచి బుద్ధులు నేర్పుతూ విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపించాల్సిన అతనే రాంగ్ రూట్ లో వెళ్ళాడు. తన దగ్గర చదువుకుంటున్న విద్యార్థినిని తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధింపులకు గురి చేశాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పరీక్షల్లో ఫెయిల్ చేశాడు. సదరు కీచక ప్రొఫెసర్ ను, అతనికి సహకరించిన మరో విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు.
దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోటాలో ఉన్న రాజస్థాన్ టెక్నికల్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు అక్కడ లాస్ట్ ఇయర్ చదువుకుంటోంది. అదే యూనివర్సిటీలో నిందితుు గిరీష్ పర్మార్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అతను బాధితురాలిని తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధించడం మొదలుపెట్టాడు. అలా చేయకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని కూడా బాధితురాలిని బెదిరించాడు.
ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల అరెస్ట్.. ఏకే-56, ఐఈడీ, గ్రెనేడ్లు స్వాధీనం.. ఎక్కడంటే ?
దీనికి ఆమె అంగీకరించకపోవడంతో ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అర్పిత్ అగర్వాల్ అనే విద్యార్థి సహాయం తీసుకున్నాడు. అతని సహాయంతో బాధితురాలి మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినా, ఆమె లొంగలేదు. దీంతో పరీక్షల్లో ఆమెను ఫెయిల్ చేశాడు. పరీక్షలు బాగా రాసినా తనను ఫెయిల్ చేయడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో గురువారం ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
అయితే, నిందితుడు బాధితురాలినే కాదు.. మరి కొందరు విద్యార్థినులను కూడా ఇలాగే బెదిరించాడు. ఈ విషయం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. దీనికోసం తీసుకువస్తుండగా ఓ న్యాయవాది కీచక ప్రొఫెసర్ ను చెంపదెబ్బ కొట్టాడు. ఇలాంటి కీచకపనికి దిగిన ప్రొఫెసర్ ను విధుల నుంచి తొలగించాలని యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు. నిరసన సమయంలో ఓ విద్యార్థి పట్టరాని ఆగ్రహంతో వైస్ ఛాన్సలర్ మీద చెప్పు విసిరేశాడు.. ఇది గమనించిన పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
