ఇజ్రాయెల్ ప్రధాని ఒక దెయ్యం.. గాజాకు ప్రధాని మోడీ అండగా నిలవాలి - అసదుద్దీన్ ఒవైసీ..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక దెయ్యం అని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గాజా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ అండగా నిలవాలని కోరారు. తాను ఎప్పటికీ పాలస్తీనాకు అండగా ఉంటానని చెప్పారు.
ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సంక్షోభం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దళాలు, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో రెండు వైపులా తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. దీంతో పాటు మరేంతో మంది గాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. యుద్ధంలో మరణించిన వేలాది మందికి, గాయపడిన గాజా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంఘీభావం తెలపాలని కోరారు. గాజా వాసులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
చెరువు శుభ్రం చేసేందుకు వెళ్లి నీట మునిగి పారిశుద్ధ్య కార్మికులు మృతి.. సిద్ధిపేటలో విషాదం..
హైదరాబాద్ లో శనివారం జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును దెయ్యంగా అభివర్ణించారు. తాను ఎప్పటికీ పాలస్తీనాకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ‘‘ నేటికీ పోరాడుతున్న గాజా ధైర్యవంతులకు లక్షలాది మంది సెల్యూట్! నెతన్యాహు ఒక దెయ్యం, నిరంకుశుడు, యుద్ధ నేరస్థుడు. పాలస్తీనా పేరు ఎత్తేవారిపై కేసులు పెడతామని మన దేశంలో ఒక బాబా ముఖ్యమంత్రి చెప్పారు, కాబట్టి బాబా ముఖ్యమంత్రీ.. వినండి, నేను గర్వంగా పాలస్తీనా జెండాను, మన త్రివర్ణ పతాకాన్ని ధరిస్తున్నాను. పాలస్తీనాకు నేను అండగా ఉంటాను’’ అని ఆయన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి అన్నారు.
నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... లారీ దూసుకెళ్లడంతో ఓ బాలుడు, ముగ్గురు యువకుల మృతి..
పాలస్తీనియన్లపై జరుగుతున్న అరాచకాలను ఆపాలని అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. పాలస్తీనా కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదని, ఇది మానవతా సమస్య అని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దాడులను కాంగ్రెస్ ఖండించింది. పాలస్తీనా హక్కులకు మద్దతు ప్రకటించింది. గత సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దళాలు, హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. పాలస్తీనా ప్రజల భూమి, స్వపరిపాలన, గౌరవంతో జీవించే హక్కుల కోసం తమకు దీర్ఘకాలిక మద్దతు ఉంటుందని పేర్కొంది.
అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడులు చేసింది. వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ లో 1,300 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో 2,200 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ లో సుమారు 1,500 మంది హమాస్ మిలిటెంట్లు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.