నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... లారీ దూసుకెళ్లడంతో ఓ బాలుడు, ముగ్గురు యువకుల మృతి..
నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు, ముగ్గురు యువకులు మరణించారు. వీరంతా యూపీకి రాష్ట్రానికి చెందిన వారు. హైదరాబాద్ లో ఉపాధి పొందుతూ దసరా నేపథ్యంలో స్వరాష్ట్రానికి బయలుదేరారు. ఇందల్ వాయి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు దిగి రోడ్డుపై నిలబడిన వారిపై నుంచి ఓ లారీ దూసుకెళ్లింది. దీంతో ఓ బాలుడు, ముగ్గురు యవకులు మరణించారు. శనివారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని పలు జిల్లాలకు చెందిన పలువురు కార్మికులు హైదరాబాద్ లో పలు రంగాల్లో పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. అయితే దేవీ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో వీరంతా తమ సొంత రాష్ట్రం యూపీకి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు.
దీంతో వారంతా ఓ ప్రైవేటు బస్సు మాట్లాడుకొని తమ స్వరాష్ట్రానికి ప్రయాణం మొదలుపెట్టారు. శనివారం అర్థరాత్రి సమయంలో ఈ బస్సు నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలం దగ్గి గ్రామ సమీపానికి చేరుకుంది. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు, నిలిపి ఉన్న లారీని ఢీకొట్టడంతో అందరూ కంగారుపడ్డారు. అందులోని పలువురు ప్రయాణికులు కిందకి దిగారు. అదే సమయంలో అటు వైపు నుంచి వేగంగా ఓ లారీ వచ్చింది. కిందకి దిగిన ప్రయాణికులపై అది దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో 17 ఏళ్ల దుర్గేశ్ ప్రసాద్, 32 ఏళ్ల జితూ, 22 ఏళ్ల గణేష్, 20 ఏళ్ల ప్రదీప్ తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇదే జిల్లాలో శుక్రవారం కూడా ఓ ప్రమాదం జరిగింది. ఇందులో ఓ యువకుడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో బోదాసు రంజిత్ (19), బోదాస్ గంగాధర్ అనే యువకులు జీవిస్తున్నారు. వీరిద్దరూ వరసకు అన్నదమ్ముల్యే వీరిద్దరూ మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
కాగా.. ఇప్పటిలాగే శుక్రవారం కూడా వారిద్దరూ పని కోసం నిజామాబాద్ కు బైక్ పై వస్తున్నారు. గంగాధర్ బైక్ డ్రైవింగ్ చేయగా.. రంజిత్ వెనకాల కూర్చొని ప్రయాణం సాగించాడు. వీరి బైక్ ముబారక్‌నగర్ సుజిత్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే.. జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వెనకాల కూర్చొని ఉన్న రంజిత్ ఒక్కసారిగా కింద పడిపోయాడు.
ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ఫ్యాక్టరీకి చెందిన లారీలు రోడ్డుపై ఉంచడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని మృతుడి బంధువులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారంతా రోడ్డుపై బైఠాయించి, నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కల్పించుకొని, తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించడంతో, పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.