పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రధాని మోడీ విపక్షాలను కోరారు.
న్యూఢిల్లీ: మణిపూర్ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీరియస్ అయ్యారు. ఈ ఘటన బాధాకరమన్నారు. మణిపూర్ ఘటన సిగ్గుపడాల్సిన విషయంగా ఆయన పేర్కొన్నారు. అమానవీయ ఘటనలకు ఎవరూ పాల్పడిన ఉపేక్షించబోమని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు.పార్లమెంట్ సమావేశాలకు ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారంనాడు మీడియాతో మాట్లాడారు.
మణిపూర్ లో రేపిస్టులను వదిలే ప్రసక్తేలేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. మణిపూర్ లో దురాగతాలను అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
అన్ని రాష్ట్రాల సీఎంలు శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని ప్రధాని మోడీ సూచించారు. మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆయన కోరారు. చట్టం తన శక్తితో తన పనిని నిర్వహిస్తుందని ప్రధాని చెప్పారు.
మణిపూర్ లో మహిళలకు జరిగిన అవమానాన్ని ఎవరూ కూడ క్షమించలేమన్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మరునాడు ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.మణిపూర్ లో రెండు మాసాలకు పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఈ ఘటనలపై తొలిసారిగా ప్రధాని మోడీ స్పందించారు.
మణిపూర్ ఘటన 140 కోట్ల భారతీయులు సిగ్గుపేడలా చేసిందని చెప్పారు. బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. మణిపూర్ ఘటనలను ప్రస్తావిస్తూ తన హృదయం కోపంతో బాధతో నిండిపోయిందని మోడీ చెప్పారు. దేశంలో ఈ తరహా ఘటనలు ఎక్కడా జరిగినా ఉపేక్షించవద్దని ఆయన సీఎంలను కోరారు.
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. కీలక బిల్లులపై చర్చిద్దామని ఆయన విపక్షాలకు సూచించారు. పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
