ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ కు మోడీ ఫోన్
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్ లో చోటు చేసుకున్న పరిణామాలపై మోడీ ఉపరాష్ట్రపతితో మాట్లాడారు.
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. నిన్న పార్లమెంట్ కాంప్లెక్స్ లో చోటు చేసుకున్న పరిణామాలపై ఉపరాష్ట్రపతితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. నిన్న జరిగిన పరిణామాలపై ప్రధాన మంత్రి బాధను వ్యక్తం చేశారు.
గత 20 ఏళ్లుగా తాను ఇలాంటి అవమానాలకు గురౌతున్నట్టుగా మోడీ పేర్కొన్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ చెప్పారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతి పట్ల కొందరు ఎంపీల తీరును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తప్పుబట్టారు.ఈ ఘటన దురదృష్టకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనతో చెప్పారని ఉపరాష్ట్రపతి చెప్పారు.
కొంతమంది తమ ప్రవర్తన ద్వారా తన కర్తవ్యాన్ని నిర్వహించకుండా అడ్డుకోలేరని తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చెప్పానన్నారు. తాను విలువలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. అవమానాలు ఏవీ తనను తన మార్గం నుండి పక్కకు తప్పించబోవని మోడీకి చెప్పినట్టుగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
నిన్న పార్లమెంట్ ఉభయ సభల నుండి విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు.దీంతో పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు.ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్ ను అనుకరించారు. ఈ విషయమై రాజ్యసభ ఛైర్మెన్ మండిపడ్డారు. రాజ్యసభ ఛైర్మెన్ ను టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనుకరించడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఫోన్ లో చిత్రీకరించారు.
తనను ఓ ఎంపీ అవహేళ చేయడం సిగ్గు చేటన్నారు. అంతేకాదు ఈ ఘటనను మరో ఎంపీ చిత్రీకరించడం ఆమోదయోగ్యం కాదని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ దంకర్ రాజ్యసభలో పేర్కొన్నారు.
ఈ నెల 13న పార్లమెంట్ పై దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభల నుండి విపక్ష పార్టీల ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు.రాజ్యసభ ఛైర్మెన్ జగదీప్ ధంకర్ ను టీఎంసీ ఎంపీ అనుకరించడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఖండించారు.