అలాంటి గేమ్స్ రెడీ చేయండి...: గేమర్స్ కు ప్రధాని మోదీ కీలక సూచనలు..
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని టాప్ 7 గేమర్స్ తో సమావేశం అయ్యారు. గేమింగ్ రంగంలో సమస్యల గురించి తెలుసుకున్న ప్రధాని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. అయితే ప్రజలకు ఉపయోగపడేలా గేమ్స్ రూపొందించాలని ప్రధాని గేమర్స్ కు సూచించారు.
న్యూడిల్లీ : లోక్ సభ ఎన్నికల వేళ వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింత దగ్గర అవుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కార్మికుల నుండి నాసా శాస్త్రవేత్తల వరకు... సినీ తారల నుండి క్రీడాకారుల వరకు అందరినీ కలిస్తున్నారు ప్రధాని. ఇలా యావత్ భారత దశం తన కుటుంబసభ్యులే అంటూ 'మోదీ కా పరివార్' ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ గేమర్లతో ప్రధాని మోదీ కలిసారు. ప్రధానిని కలిసినవారిలో అనిమేష్ అగర్వాల్, మిథిలేష్ పాటంకర్, పాయల్ ధరే, నమన్ మాథుర్, అన్షు బిస్త్, గణేష్ గంగాధర్,తీర్థ్ మెహతా తదితర గేమర్లు వున్నారు. @ignindia, @mashable.india భాగస్వామ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
శనివారం ఉదయం గేమర్లతో ప్రధాని మోదీ చిట్ చాట్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. ఏడుగురు గేమర్లతో ప్రధాని మోదీ సరదాగా మాట్లాడటమే కాదు సీరియస్ చర్చ కూడా జరిపారు. యువత ఈ గేమింగ్ రంగాన్ని కెరియర్ ఎంచుకునే అవకాశాలు, ఈ రంగాన్ని అభివృద్ది చేసేందుకు గల అవకాశాలపై గేమర్లతో చర్చించారు పీఎం. ఇక ఈ గేమింగ్ విద్యార్థులపై ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తోంది... దాన్ని అరికట్టడంపైనా ప్రధాని చర్చించారు.
గేమింగ్ కాన్సెప్ట్ పై చర్చ :
గేమింగ్ కాన్సెప్ట్ గురించి ప్రధాని మోదీ గేమర్లతో చర్చించారు. గేమ్ ఆడే వ్యక్తికి తమ ఆటపై చాలా ఆసక్తి ఉంటుందని... అందుకే అందులోని పాత్రల పేర్లు చాలా ప్రభావం చూపుతాయని గేమర్లు అన్నారు. ఇక గేమర్లు ప్రతి స్థాయిలోనూ సవాళ్లను ఎదుర్కొంటేనే ఆ గేమ్ లో మజా వుంటుందని ప్రధానికి తెలిపారు. ఈ గేమింగ్ కాన్సెప్ట్ 2019 నుండి భారతదేశంలో విజృంభించిందని గేమర్స్ ప్రధానికి వివరించారు.
భారతీయ సంస్కృతి, విలువలపై గేమ్స్ రూపొందించాలన్న ప్రధాని :
గేమర్స్‌తో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ వారి అభిప్రాయాలను వినడంతో పాటు తన అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. ఎవరూ ఈ-గేమింగ్‌కు బానిస కావడాన్ని తాను ఇష్టపడను... కానీ అందులోని మంచి అవకాశాలను ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తానని అన్నారు. అవకాశం వుంటే
భారతీయ సంస్కృతి, సామాజిక మరియు మతపరమైన విలువలతో ప్రజలను కనెక్ట్ చేసేలా గేమ్స్ తయారు చేయడానికి ప్రయత్నించాలని ప్రధాని సూచించారు. ఈ గేమ్ ద్వారా ప్రజలు తమ సంస్కృతి మరియు నాగరికత గురించి కూడా తెలుసుకోవచ్చన్నారు. అలాగే ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా కూడా గేమ్స్ రూపొందించాలని ప్రధాని మోదీ సూచించారు.
తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తుంటారా? ప్రధాని ప్రశ్నకు గేమర్స్ జవాబు...
మీ వల్ల తమ పిల్లలు చెడిపోతున్నారని తల్లిదండ్రులు ఎప్పుడైనా ఫిర్యాదు చేస్తారా? అని ప్రధాని గేమర్లను సరదాగా అడిగారు. దీనికి అవునంటూ గేమర్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులు వస్తుంటాయి... అందుకు మీ పిల్లలు సరదాగా గేమ్ ఆడుకునేలా చూడటంతో పాటు చదువుపై దృష్టిపెట్టేలా చూడాలని సమాధానం చెబుతామన్నారు. గేమ్ ఆడేటపుడు తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత వారి పిల్లలదే అని గేమర్లు తెలిపారు.
గేమర్లతో ప్రధాని ఫన్ :
ప్రధానితో మాట్లాడుతున్న సమయంలో ఓ గేమర్ వయసు తేడా గురించి ప్రస్తావించాడు. అందుకు ప్రధాని సరదాగా రియాక్ట్ అయ్యారు. తన వయసేమీ అంత పెద్దది కాదు... ఇంచుమించు మీ వయసువాడినే అంటే నవ్వులు పూయించారు. మీడియా వాళ్లు ఏదేదో చెబుతుంటారు... అవన్నీ నమ్మవద్దంటూ ప్రధాని అనడంతో గేమర్లు నవ్వడం ప్రారంభించారు.
సృజనాత్మకత, అమ్మాయిలు, కెరియర్ విషయంలో గేమింగ్ పాత్ర ఎలాంటిది?
సృజనాత్మకత పరంగా ఈ గేమింగ్ ఎలాంటి పాత్ర పోషిస్తుందని ప్రధాని అడిగారు. దీనిపై గేమర్స్ మాట్లాడుతూ...గతంలో గేమింగ్ ప్రపంచంలో కెరీర్ అవకాశాలు చాలా తక్కువగా ఉండేవన్నారు. కానీ ప్రస్తుతం దాని పరిధి చాలా పెరిగిందని అన్నారు. కొత్త క్రియేషన్స్ మరియు కొత్త గేమ్‌లను డెవలప్ చేసే సామర్థ్యం వుంటే ఈ ఫీల్డ్ ను కెరీర్ గా ఎంచుకోవచ్చని అన్నారు. అమ్మాయిల కెరీర్ విషయానికి వస్తే గతంలో గేమర్స్ గా రాణించడం అమ్మాయిలకు చాలా కష్టంగా వుండేదన్నారు. కానీ ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా గేమింగ్ రంగంలో అమ్మాయిలు రాణిస్తున్నారని... వారికి కూడా మంచి అవకాశాలు వున్నాయన్నారు.
తన కోడ్ వెల్లడించిన మోదీ :
గేమింగ్ లో కోడ్ గురించి చర్చిస్తున్న సమయంలో గేమర్లు పొలిటికల్ ప్రసంగాల గురించి ఎలాంటి కోడ్ ఉపయోగిస్తారని అడిగారు. అందుకు ప్రధాని తన P2G2 (Probe People Good Governance) గురించి వివరించారు.
ప్రధాని మోదీకి గేమర్స్ కొత్తపేరు :
పీఎంను గేమింగ్ ప్రపంచంలో కూడా గురువుగా పేర్కొంటూ గేమర్స్ మోదీకి కొత్తపేరు పెట్టారు. NOP (Namo Over Powered) అందరికంటే శక్తుమంతుడిగా ప్రధానికి కొనియాడారు గేమర్లు. అలాగే తమ సమస్యలను పీఎం దృష్టికి తీసుకువేళ్లగా వాటిని అధికారిక ఇ మెయిల్ కు పంపాలని ప్రధాని సూచించారు.
గేమర్స్ తో పలు గేమ్స్ ఆడిన మోదీ :
తమతో కలిసి గేమ్ ఆడాలని ప్రధానిని కోరారు గేమర్స్. వారి అభ్యర్థనను మన్నించి మోదీ పలు గేమ్స్ ఆడారు. ఈ క్రమంలోనే తాను కూడా ఈ గేమ్స్ కు అలవాటుపడిపోతానేమో అంటూ సరదాగా కామెంట్స్ చేసారు. చివరగా గేమర్స్ ప్రతిభను ప్రశంసించిన ప్రధాని మోదీ వారికి ఉజ్వల భవిష్యత్ వుండాలని ఆకాక్షించారు. ప్రధాని గేమర్స్‌తో ఫొటోలు దిగి బహుమతులు కూడా ఇచ్చారు.
వీడియో