గౌహతి: అస్సాం బిజెపి ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ శాసనసభలో కరోనా వైరస్ కు మందులు చెప్పారు. కరోనా వైరస్ కు గోమూత్రం, పెండ మందులుగా పనిచేయవచ్చునని ఆమె చెప్పడంతో శాసనసభలో అందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. 

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గోమూత్రం, పెండ పనిచేస్తాయని ఆమె చెప్పారు. ఆవు పేడ చాలా ప్రయోజనకారి అనే విషయం మనందరికీ తెలిసిందేనని, అదే విధంగా గోమూత్రం చల్లితే ఆ ప్రాంతమంతా పవిత్రమవుతుందని ఆమె అన్నారు. కరోనా వైరస్ ను నయం చేయడానికి కూడా అటువంటి పనిచేయవచ్చునని ఆమె అన్నారు. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బంగ్లాదేశ్ కు పశువులను అక్రమంగా తరలిస్తున్న వైనంపై చర్చ జరుగుతుండగా ఆమె ఆ విషయాలు చెప్పారు. భారతదేశం నుంచి, మరీ ముఖ్యంగా అస్సాం నుంచి గోవులను స్మగ్లింగ్ చేయడం వల్ల బంగ్లాదేశ్ ఆర్థికంగా బలం పుంజుకుందని ఆమె అన్నారు. 

ప్రపంచంలోని అతి పెద్ద బీఫ్ ఎగుమతి దేశాల్లో బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉందని, ఆ అవులన్నీ మనవేనని, గోవుల స్మగ్లింగ్ ను నిరోధించడానికి గత కాంగ్రెసు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు 

గోవులను అక్రమంగా రవాణా చేయడానికి నదీ మార్గాలను వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. పశువుల మార్కెట్లను ప్రభుత్వం క్షుణ్నంగా పరిశీలించాలని, తద్వారా నకిలీ రిసీట్లతో జరుగుతున్న పశువుల వ్యాపారాన్ని ఆపాలని ఆమె అన్నారు.