డెహ్రాడూన్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ పూజారి కుటుంబంలోని ఐదుమందిని కత్తితో పొడిచి చంపి, మృతదేహాల వద్ద క్షుద్రపూజలు చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని ఓ ఉన్మాది అతి కిరాతకంగా హత్యచేశాడు. ఉత్తరప్రదేశ్లోని బండకు చెందిన మహేష్ కుమార్ తివారి అనే వ్యక్తి పూజారిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత ఏడేళ్లుగా డెహ్రాడూన్లోని రాణి పోఖారీలో నివసిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం ఉదయం సొంత కుటుంబాన్ని అతి క్రూరంగా నరికి చంపాడు. 40 ఏళ్ల ఈ పూజారి సొంత కుటుంబంలోని ఐదుగురిని కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుల్లో నిందితుడి తల్లి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హత్య అనంతరం మృతదేహాల వద్ద క్షుద్ర పూజలు నిర్వహించాడు. 

ఈ సంఘటన సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు జరిగింది. అయితే ఇంట్లో నుంచి కుటుంబసభ్యుల అరుపులు విన్న ఇరుగు పొరుగువారు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న డెహ్రాడున్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డెహ్రాడున్ పోలీసు సూపర్డెంట్ (రూరల్) తెలిపారు. నిందితుడు ఇంత దారుణానికి ఎందుకు తెగబడ్డాడు అనేది.. ఇంకా తెలియలేదు. దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

దుబాయ్ లో ఖరీధైన విల్లా కొనుగోలు చేసిన ముఖేష్ అంబానీ.. చిన్నకొడుకు కోసమట.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయి...

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరులో ఇలాంటి ఘటనే జరిగింది. మూటపురం అనూష (30) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అత్త క్షుద్రపూజల వల్లే ఆమె బలి అయిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం ఎస్. లింగోటం గ్రామానికి చెందిన అనూష వివాహం జూలూరుకు చెందిన మూటపురం బాబురావుతో 2017లో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఆరునెలల కుమారుడు ఉన్నాడు. విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్ అయిన బాబురావు చేయి ఇటీవల విద్యుదాఘాతానికి గురై కాలిపోయింది. 

కుటుంబ కలహాలతో బాబురావు నిత్యం భార్యను కొట్టి, వేధించేవాడు. ఈ క్రమంలో అనూష వారంరోజులుగా అమ్మ తల్లి సోకి అనారోగ్యంతో బాధ పడుతుంది. ఆదివారం ఉదయం బాబురావు తన బావమరిది గిరిబాబుకు ఫోన్ చేసి అనూష ఆరోగ్యం విషమంగా ఉందని, వెంటనే రమ్మని చెప్పాడు. ఆయన వచ్చేసరికి ఓ గదిలో అనూష శరీరమంతా కాలిపోయి మృతి చెంది ఉంది.

అనూష అత్త యాదమ్మ తరచూ క్షుద్ర పూజలు చేస్తుంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. శనివారం అమావాస్య కావడం, అనూష మృతదేహం పక్కన నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఉండడం, ఉదయం వరకు ఇంట్లో పెద్దదీపం వెలుగుతూ ఉండటం వంటివి విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇంట్లో క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చని అనుమానాలకు బలం చేకూరుతోంది. అనూషకు మత్తు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత క్షుద్రపూజలు చేసి, చంపి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనూష ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించేందుకు భర్త, అత్త ఆమె ఒంటిపై యాసిడ్ పోసినట్లు సమాచారం.