గత కొంత కాలంగా వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలుస్తున్న మధ్యప్రదేశ్ లోెని గంగా జమ్నా స్కూల్ పై అక్కడి బీజేపీ ప్రభుత్వం ‘బుల్డోజర్ చర్య ’ చేపట్టింది. అనధికారికంగా నిర్మాణాలు చేపట్టారని పేర్కొంటూ ఆ స్కూల్ ను కూల్చేసింది.
హిజాబ్ ధరించాలని హిందూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న మధ్యప్రదేశ్ లోని గంగా జమ్నా సెకండరీ స్కూల్ బిల్డింగ్ పై అక్కడి బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ చర్యకు ఉపక్రమించింది. ముస్లిమేతర బాలికలను హిజాబ్ ధరించాలని ఒత్తిడి చేసిన కేసులో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ సహా ముగ్గురిని అరెస్టు చేసిన రెండు రోజుల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. దామోహ్ జిల్లాలో ఉన్న ఈ స్కూల్ ప్రధాన భాగాన్ని అనధికారిక నిర్మాణాల తొలగింపులో భాగంగా మంగళవారం నేలమట్టం చేశారు.
దారుణం.. ప్రధాని మోడీని, సీఎం యోగిని ప్రశంసించాడని కారుతో గుద్ది చంపిన డ్రైవర్
స్థానిక మున్సిపాలిటీల బృందాలు పాఠశాల మొదటి అంతస్తును కూల్చివేశారు. సంబంధింత అధికారుల అనుమతి లేకుండానే వీటిని నిర్మించారని కూల్చివేసినట్టు తెలుస్తోందని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పేర్కొంది. పాఠశాల ఆవరణలో అనధికారిక నిర్మాణాలకు సంబంధించి స్థానిక మునిసిపాలిటీ ఇటీవలే పాఠశాలకు నోటీసులు జారీ చేసిందని దామోహ్ జిల్లా సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ నోటీసులో పేర్కొన్న మూడు రోజుల గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిపోయింది. దీంతో అధికారులు ఆ బిల్డింగ్ ను కూల్చేయడానికి మార్గం సుగమమైంది.
కాగా.. కూల్చివేత చర్యకు కొన్ని గంటల ముందు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా భోపాల్ లో పాఠశాల ఆవరణలో ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ కు ఆదేశించారు. అయితే ఈ కూల్చివేతల వల్ల 1200 మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిననివ్వబోమని హామీ ఇచ్చారు. పాఠశాల విద్యార్థుల చదువు కోసం వేరే చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేలా చూస్తామని మిశ్రా తెలిపారు.
పాఠశాలపై జూన్ 7న నమోదైన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ముగ్గురు వ్యక్తులను (పాఠశాల నిర్వహణ కమిటీలోని 11 మంది సభ్యుల్లో ఒకరు) అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత పాఠశాలపై ఆక్రమణ తొలగింపు చర్య జరిగింది. హిందూ విద్యార్థులను 'హిజాబ్' వంటి కండువా ధరించాలని, అలాగే మత ప్రార్థనలు చేయాలని, హిందూ విద్యార్థులు ధరించే మతపరమైన వస్తువులను తొలగించాలని ఒత్తిడి చేసినందుకు జూన్ 7వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది.
జూన్ 7న ముగ్గురు 6, 8వ తరగతి విద్యార్థుల వాంగ్మూలాల ఆధారంగా దామోహ్ కొత్వాలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెకండరీ, హయ్యర్ సెకండరీ పాఠశాలల గుర్తింపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ జూన్ 2న సంబంధిత పాఠశాల గుర్తింపును మధ్యప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది.
వార్నీ.. తప్పతాగి రైల్వే ట్రాక్ పై పడుకున్న యువకుడు.. రైలు దిగి నిద్రలో నుంచి లేపిన లోకో పైలట్
మధ్యప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్ టాపర్ బాలురు, బాలికలను అభినందిస్తూ ఇటీవల ఈ పాఠశాల ఏర్పాటు చేసిన పోస్టర్ వల్ల వివాదంలో మొదలైంది. ఆ పోస్టర్ లో పలువురు హిందూ విద్యార్థులు ‘హిజాబ్’ లాంటి కండువా ధరించి కనిపించారు. దీనిపై ఏబీవీపీ, వీహెచ్ పీ వంటి మితవాద సంస్థలు ఆందోళన చేపట్టాయి. ఆ తర్వాత రాష్ట్ర సీఎం, హోంమంత్రి ఆదేశాల మేరకు పాఠశాలపై హైపవర్ కమిటీ విచారణ ప్రారంభించడంతో పాటు అదే పాఠశాలపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ విచారణ చేపట్టింది.
