West Bengal: జూలై 18న (సోమ‌వారం) రాష్ట్రపతి ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. జూలై 21న పార్లమెంట్‌ హౌస్‌లో ఓట్ల లెక్కింపు, జూలై 25న తదుపరి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ద్రౌప‌ది ముర్ము, య‌శ్వంత్ సిన్హాలు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు.  

Mamata Banerjee: రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. కేంద్రంలోని అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూట‌మి రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము బ‌రిలో నిలిచారు. ఇక దేశంలోని ప్ర‌తిపక్ష పార్టీలు త‌ర‌ఫున య‌శ్వంత్ సిన్హా రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌లు దేశంలో ఎన్నిక‌ల హీట్ ను పుట్టిస్తున్నాయి. బీజేపీ, ప్ర‌తిప‌క్ష పార్టీలు మ‌ధ్య రాజ‌కీయం వేడెక్కింది. బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర స్థాయిలో కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే సోమవారం జ‌ర‌గ‌నున్న రాష్ట్రపతి ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బెంగాల్ అంతటా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని "ఆదివాసి వ్యతిరేకి" అని అభివర్ణించే పోస్టర్‌లను ఏర్పాటు చేసింది. పోస్టర్లలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కూడా ఉన్నారు. ముర్ము గిరిజన వర్గానికి చెందినవారు. 

గ్లౌజ్‌లు ధరించిన గిరిజన సంఘం సభ్యులు నృత్యం చేస్తున్నప్పుడు మమతా బెనర్జీ చేతులు పట్టుకున్నట్లు బీజేపీ వేసిన పోస్టర్‌లలో ఉంది. అలీపుర్‌దూర్‌ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో 'జనజాతీయ' మహిళలు గ్లౌజులు ధరించాలని ముఖ్యమంత్రి పట్టుబట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తృణ‌మూల్‌ కాంగ్రెస్, అనేక ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దించాయి. ఆయ‌న గెలుపుకోసం అన్ని పార్టీల మ‌ద్ద‌తును కోరుతున్నాయి. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్.. ద్రౌప‌ది ముర్ముకు అనుకూలంగా ఓటు వేయాలని టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన, సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP), RJD మిత్రపక్షం జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సహా వివిధ పార్టీలు NDA అభ్యర్థికి తమ మద్దతును ప్ర‌క‌టించాయి. అఖిలేష్ యాదవ్ మామ శివపాల్ సింగ్ యాదవ్ కూడా ముర్ముకు తన మద్దతును అందించారు. .

ద్రౌప‌ది ముర్ము జార్ఖండ్ మాజీ గవర్నర్, ఒడిశా మాజీ మంత్రిగా ప‌నిచేశారు. రాష్ట్రప‌తిగా ఆమె ఎన్నికైతే, భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతి, దేశానికి రెండవ మహిళా రాష్ట్రపతిగా చ‌రిత్ర సృష్టించ‌నున్నారు. ఒడిశాలోని వెనుకబడిన జిల్లా మయూర్‌భంజ్ గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన ద్రౌపది ముర్ము అనేక‌ సవాళ్లను ఎదుర్కొంటూ తన చదువును పూర్తి చేసింది. కాగా, జూలై 18న (సోమ‌వారం) రాష్ట్రపతి ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. జూలై 21న పార్లమెంట్‌ హౌస్‌లో ఓట్ల లెక్కింపు, జూలై 25న తదుపరి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, భారత 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు దాదాపు 4,800 మంది ఎంపీలు-ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయనున్నారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రతిపక్షాల అభ్య‌ర్థి యశ్వంత్ సిన్హాపై స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉన్నార‌ని ప్ర‌స్తుతం అందుతున్న రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆమెకు అనుకూలంగా 60 శాతానికి పైగా ఓట్లు పోలయ్యే అవకాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల స‌మాచారం.