ఉరి శిక్ష పడిన నేరస్థులకు క్షమాభిక్ష పిటిషన్ల అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాజ్‌స్థాన్‌లోని శిరోహిలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి మాట్లాడుతూ... మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశమన్నారు.

చిన్నారులు, బాలికలపై అత్యాచారం చేసి పోక్సో చట్టం కింద అత్యాచార కేసుల్లో ఉరిశిక్ష పడిన దోషులకు క్షమాభిక్ష కోరే అర్హత లేదని కోవింద్ తేల్చి చెప్పారు. లైంగిక దాడులు, వేధింపుల బారి నుంచి చిన్నారులు, బాలికలను రక్షిందచేందుకు పోక్సో చట్టాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్రపతి గుర్తుచేశారు.

Also Read:దిశను బూతులు తిడుతూ... నిందితుడి బంధువు షాకింగ్ కామెంట్స్

మహిళా భద్రత కోసం ఎన్నో చేశామని, ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉందని రామ్‌నాథ్ అన్నారు. పిల్లల్లో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చేయాల్సిన బాధ్యత తల్లీదండ్రులపై ఉందని ఆయన సూచించారు.

మహిళా సాధికారతతోనే సమాజంలో సమానత్వం, సామరస్యత సాధ్యమన్నారు. కాగా నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ నిందితుల్లో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష పెట్టుకున్న పిటిషన్‌ సందర్భంగా రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read:CP V.C. Sajjanarఎన్ కౌంటర్ స్పెషలిస్ట్: ఎవరీ వీసీ సజ్జనార్?

వినయ్ శర్మ పిటిషన్‌ను తిరస్కరించాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. అంతకు ముందు వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే. నిర్భయ కేసులో వినయ్ శర్మతో పాటు మరో ముగ్గురు దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్షను విధించింది. ప్రస్తుతం వీరు తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.