న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషి పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. తన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన తర్వాత పవన్ గుప్తా రాష్ట్రపతి మెర్సీ పిటిషన్ ను పెట్టుకున్నారు. ఆ పిటిషన్ రాష్ట్రపతి బుధవారంనాడు తిరస్కరించారు.

రాష్ట్రపతి వద్ద పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ పెండింగులో ఉండడంతో నిర్భయ దోషుల ఉరిశిక్షపై పాటియాల హౌస్ కోర్టు స్టే విధించింది. నిర్భయ కేసు నిందితులు నలుగురిని మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని అంతకు ముందు డెత్ వారంట్ జారీ చేసింది. పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను దాఖలు చేసుకున్న నేపథ్యంలో ఉరిపై స్టే విధించాలని దోషులు కోర్టుకెక్కారు. దీంతో మూడోసారి వారి ఉరిశిక్ష వాయిదా పడింది. 

Also Read: కోర్టులు తమాషా చూస్తున్నాయి: స్టేపై నిర్భయ తల్లి ఆగ్రహం

2012 డిసెంబర్ లో వైద్య విద్యార్థినిపై ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆరుగురు నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో అతను శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. మరో నిందితుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. 

పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో నలుగురు దోషులను ఉరి తీయడానికి ఏ విధమైన ఆటంకాలు ఉండవని భావిస్తున్నారు. నలుగురు దోషులు పూర్తిగా తమ న్యాయపమైన అవకాశాలను వాడుకున్నట్లు అర్థమవుతోంది. ఇక ఉరి నుంచి తప్పించుకోవడానికి వారికి ఏ విధమైన ప్రత్యామ్నాయలు ఉండవని అనుకుంటున్నారు. ఈ నెల 20వ తేదీలోగా కోర్టు కొత్త డెత్ వారంట్ జారీ చేసే అవకాశం ఉంది.

Also Read: నిర్భయ కేసు: ఎవరీ దోషుల తరుఫు న్యాయవాది ఏపీ సింగ్?