నిర్భయ దోషుల ఉరిశిక్షపై ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మరోసారి స్టే విధించడంతో బాధితురాలి తల్లి ఆశా దేవి తీవ్ర నిరాశకు గురయ్యారు. న్యాయస్థానం తీర్పు అనంతరం ఆమె మాట్లాడుతూ... కోర్టులు కూర్చొని తమాషా చూస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దోషులను ఉరి తీయాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి కోర్టు ఇంత సమయం ఎందుకు తీసుకుందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఉరిని పదే పదే వాయిదా వేయడం మన వ్యవస్థ వైఫల్యమని ఆమె ఉద్వేగానికి గురై, కంటతడి పెట్టారు. మన వ్యవస్థ మొత్తం నిందితులకే అనుకూలంగా ఉందని ఆశా దేవి ఆరోపించారు.

Also Read:దేవుడి వద్దకు అలా వెళ్లొద్దు: నిర్భయ కేసు దోషుల ఉరి వాయిదాపై కోర్టు

దోషులను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని ఆమె మండిపడ్డారు. తన కుమార్తెపై దారుణం జరిగి ఇన్నేళ్లు అవుతున్నా దోషులకు శిక్ష అమలు చేయడంలో ఇంతగా ఎందుకు జాప్యం జరుగుతోందని ఆశా దేవి ప్రశ్నించారు.

తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసులో చివరికి ఏం జరుగుతుందోనని ప్రపంచం మొత్తం భారతదేశాన్ని గమనిస్తున్నాయని ఆశాదేవి చెప్పారు. 

నిర్భయ దోషులకు రేపు ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉండింది. ఈ స్థితిలో కోర్టు ఉరిశిక్షను వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు దోషులను ఉరితీయకూడదని ఆదేశించింది.

Also Read:నిర్భయ కేసు: దోషులకు రేపు ఉరి లేదు, మూడోసారి వాయిదా

నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షను వాయిదా వేయడానికి గల కారణాన్ని వివరిస్తూ పాటియాల హౌస్ కోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. బాధితుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ ఉరిశిక్ష పడిన ఓ దోషి  న్యాయపరమైన అన్ని అవకాశాలను వాడుకునే అవకాశాన్ని తనకు కోర్టులు కల్పించలేదనే బాధతో సృష్టికర్త వద్దకు వెళ్లకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.