దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌లతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌లతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. వాజ్‌పేయి వర్దంతి సందర్భంగా ఆయన స్మారకం 'సదైవ్ అటల్' వద్ద ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కర్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 'సదైవ్ అటల్' వద్ద జరిగిన ప్రార్థనా సమావేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
‘‘అటల్ జీ పుణ్య తిథి నాడు ఆయనకు నివాళులు అర్పించడంలో 140 కోట్ల మంది భారత ప్రజలతో నేను చేరుతున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆయన నాయకత్వం నుంచి భారతదేశం చాలా లాభపడిందని అన్నారు. మన దేశ ప్రగతిని పెంచడంలో, విస్తృత శ్రేణి రంగాలలో 21వ శతాబ్దానికి తీసుకువెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
బీజేపీ మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన వాజ్‌పేయి.. ఆ పార్టీ నిర్మాణంలో కూడా కీలకపాత్ర పోషించారు. విశేష ప్రజాదరణ పొందిన వాజ్‌పేయి.. ఆరేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించిన ఘనత పొందారు. ఆ సమయంలో దేశంలో సంస్కరణలు తీసుకురావడం, మౌలిక సదుపాయాలను పెంచడం చేశారు. ఇక, వాజ్‌పేయి 93 సంవత్సరాల వయస్సులో 2018లో మరణించారు.
