అందుకే రాష్ట్రపతిని పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు.. మరోమారు ఉదయనిధి సంచలనం..
భారత పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించకపోవడంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ పలు ప్రశ్నలు సంధించారు.

భారత పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించకపోవడంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతువు కావడం, గిరిజన సమాజానికి చెందిన వారు కావడం వల్లనే ఆమె గైర్హాజరు కావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. దీనినే సనాతన ధర్మం అంటున్నామని మరోసారి ఉదయనిధి స్టాలిన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
బుధవారం రోజున మదురైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. దాదాపు 800 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం ఒక స్మారక ప్రాజెక్టు అని అన్నారు. అయినప్పటికీ దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం పంపబడలేదని అన్నారు. ఆమె గిరిజన నేపథ్యం, వితంతువు హోదా కారణంగానే ఈ విధంగా జరిగిందని.. ఇది సనాతన ధర్మానికి సంబంధించిన ఆందోళనల వల్ల ప్రభావితమైందని చెప్పుకొచ్చారు.
‘‘కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. వారు (బీజేపీ) ప్రారంభోత్సవానికి తమిళనాడు నుంచి అధీనం తీసుకున్నారు. కానీ ఆమె వితంతువు, గిరిజన సమాజానికి చెందినందున భారత రాష్ట్రపతిని ఆహ్వానించలేదు. ఇది సనాతన ధర్మమా? దీనికి వ్యతిరేకంగా మేం గళం విప్పుతూనే ఉంటాం’’ అని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కూడా హిందీ నటీమణులను ఆహ్వానించారని.. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఆమెను మినహాయించారని ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలపై ‘‘సనాతన ధర్మం’’ ప్రభావం ఎలా ఉంటుందో ఈ ఘటనలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇక, కొద్దిరోజుల కిందట సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై కూడా స్టాలిన్ మరోసారి స్పందించారు. ‘‘కొందరు నా తలకు రేటు ఫిక్స్ చేశారు. నేను అలాంటి వాటి గురించి ఎప్పటికీ బాధపడను. సనాతన ధర్మాన్ని నిర్మూలించే సూత్రాలపై డీఎంకే స్థాపించబడింద. మా లక్ష్యం పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకోం’’ అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.