ఎమ్మెల్యే నా ప్రాణమని.. ఆయన లేకుండా నేను ఉండలేనంటూ ఓ మహిళ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగడం మైసూరులో సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణరాజా బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఏ రామదాస్ ఇంటికి 45 సంవత్సరాలున్న ఓ మహిళ వచ్చింది.. తన పేరు ప్రేమకుమారి అని ఎమ్మెల్యే రామదాస్ తన భర్త అని.. అతన్ని కలవాలని ఎమ్మెల్యే ఇంటిలోని వ్యక్తిగత సిబ్బందిని కోరింది..

ఆయన ఇంట్లో లేరని అధికారిక కార్యక్రమం కోసం బయటకు వెళ్లారని సిబ్బంది చెప్పడంతో.. ప్రేమకుమారి ఒక్కసారిగా ఆందోళనకు దిగింది.. పెద్ద పెద్దగా నినాదాలు చేస్తూ.. నేను గొప్ప కుటుంబం నుంచి వచ్చాను... బతికున్నంత వరకు రామదాస్‌ను వదలను.. నేను ఎమ్మెల్యేను  ప్రేమిస్తున్నాను.. అందుకే గత ఎన్నికల్లో పోటీ చేయలేదు.. అంటూ ఏడిస్తూ ఆరోపణలు చేసింది.. ఈ విషయం మీడియాకు చేరడంతో.. అక్కడ అంతా గందరగోళంగా మారింది. అయితే ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజార్చడానికి.. ఆయన వద్ద నుంచి డబ్బు గుంజడానికి ఆమె బ్లాక్‌మెయిల్ చేస్తోందని కొందరు నేతలు ఆరోపించారు.

ఐదేళ్లుగా వ్యవహారం:

అయితే 2014 నుంచి వీరిద్దరి వ్యవహారం కన్నడనాట హాట్ టాపిక్‌గా మారింది. తుముకూరు డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో సెకండ్ డివిజన్ క్లర్క్‌గా పనిచేస్తోన్న ప్రేమకుమారి అనే మహిళ.. తనను మంత్రి రామదాస్‌ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ మీడియా సమావేశం పెట్టడం అప్పట్లో కలకలం రేపింది.. ట్రాన్స్‌ఫర్ల వంకతో తనను తరచుగా ఆఫీసుకు పిలుపించుకునేవాడని.. అలా తమ మధ్య బంధం ఏర్పడిందని ప్రేమ కుమారి ఆరోపించింది.

ఆయన తనను రహస్యంగా వివాహం చేసుకున్నారని.. ఇందుకు సంబంధించి ఇద్దరి మధ్య నడిచిన సంభాషణల ఆడియో, వీడియో క్లిప్పింగులు, ఫోటోలను మీడియాకు అందజేసింది.. సరిగ్గా ఆ సమయంలోనే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దానిని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది.. అంతకు మించి ఏం చెప్పినా నేను విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానని అవతలి వైపు స్వరం వినిపించింది.

ఈ సంఘటన తర్వాతి రోజు రామదాస్ ఆత్మహత్య చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. విషం సేవించి ఫ్యాన్‌కు ఉరివేసుకున్న ఆయన్ను సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.. అటు తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ విషయం సద్దుమణిగింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మళ్లీ ప్రేమకుమారి రంగప్రవేశం చేసింది.. రామదాస్‌పై తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి షాక్ ఇచ్చింది.. తాజాగా ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసనకు దిగడం సంచలనం సృష్టించింది.