ఛత్తీస్ ఘడ్ లోని ఓ మహిళా డీఎస్పీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. నిండు గర్బిణీ అయిన ఆమె చేతిలో లాఠీ పట్టుకున్ని ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, కోవిడ్ రూల్స్ పాటించాలంటూ వాహనదారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. 

దీన్ని ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. మండు టెండలో నిండు గర్భంతో విధులు నిర్వరిస్తున్న ఆమె డీఎస్పీ శిల్పా సాహు, బస్తర్ లోని దంతెవాడలో విధులు నిర్వహిస్తున్నారు. 

స్వయంగా ట్రాఫిక్ నియంత్రిస్తున్న శిల్పా సాహు ఫొటోను ట్విటర్ లో షేర్ చేస్తూ అడిషినల్ ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ దీపాన్షు కబ్రా ఇలా రాశారు.. ‘దంతెవాడ డీఎస్పీ శిల్పాసాహు ఫొటో ఇది. గర్బిణిగా ఉన్నా శిల్పా న విధుల్లో.. తన టీంతో బిజీగా ఉంది. అంతేకాదు కోవిడ్ నిబంధనలు పాటించాలని, లాక్ డౌన్ ను ఉల్లంఘించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది’ అంటూ రాసుకొచ్చారు.

అంతేకాదు మహమ్మారి నేపథ్యంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ నుంచి ప్రజల్ని కాపాడడానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మీవంతు బాధ్యతగా లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

అనేకమంది ట్విటర్ యూజర్లు శిల్పాసాహు కమిట్ మెంట్ ను ప్రశంసించారు. ఆమె తనకంటే తన విధులు గొప్పవని భావిస్తోంది. ఆమెను అభినందించండి. ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడడమే ముఖ్యమని ఆమె ఆలోచించింది.. అంటూ ట్వీట్ చేశారు. 

అనేకమంది ఆమెను హీరో అంటూ పొగిడారు. మరికొంతమంది శిల్పాసాహూకు సలామ్.. అయితే మీరు, మీ కడుపులోని ఇంకో వ్యక్తిని కూడా జాగ్రత్తగా చూసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. 

ఇలాంటి మహమ్మారి సమయంలో గర్భిణి అయిన ఆమె ఇంత రిస్క్ తీసుకోవడం సరికాదని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇది తప్పు.. ఆమె అలా చేయకూడదు. ఆమెతో అలా విధులు నిర్వర్తించేలా చేసే బదులు.. తనకు సెలవు ఇవ్వచ్చు కదా అంటూ మరికొందరు ట్వీట్ చేశారు. 

నిరుడు, ఐఎఎస్ సౌమ్య పాండే తన 14 రోజుల శిశువుతో కార్యాలయం నుండి పనిచేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు కూడా ఇలాంటి ఆందోళనలే తలెత్తాయి.