యూపీలోని ప్రయాగరాజ్ మహాకుంభ మేళా ప్రాంతంలోని శాస్త్రీ వంతెన సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిలిండర్లు పేలడంతో 11 టెంట్లు దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలాన్ని సీఎం యోగి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రధాని మోదీ సైతం ఈ ఘటనపై స్పందించారు. 

ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభ మేళా కోలాహాలంగా సాగుతోంది. లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు తరలి వచ్చి.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే, ఆదివారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. 

ప్రయాగరాజ్‌లోని శాస్త్రీ వంతెన సమీపంలోని టెంట్లకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో గీతా ప్రెస్ టెంట్ సహా 11 టెంట్లు దగ్ధమయ్యాయి. అయితే, అధికారులు, అగ్నిమాపక దళం వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.

కుంభమేళాలో అగ్నిప్రమాదానికి కారణమేంటి?

ప్రయాగరాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదంపై అధికారులు ఓ అంచనాకి వచ్చారు. సిలిండర్ పేలుడు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే, సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 10-12 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

సెక్టార్ 18, 19, 20 ప్రాంతాలు ప్రధానంగా అఖాడాలు, భక్తుల కోసం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోనే అగ్నిప్రమాదం జరిగినప్పటికీ.. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. 

మహాకుంభ మేళాను పరిశీలించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

మహాకుంభ మేళాలో జరిగిన ఈ ఊహించని సంఘటన తర్వాత ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం వెంటనే స్పందించి.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. భక్తులు లేదా సాధువులకు ఎలాంటి హాని జరగలేదని నిర్ధారించుకున్నారు. తర్వాత, సీఎం యోగి మేళా ప్రాంగణంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను పరిశీలించారు. సాధువు మోరారీ బాపు పండాల్ లో కథా కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, మహా కుంభమేళాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు ధ్రువీకరించారు. సాధువులు, భక్తులు అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కుంభమేళాలో అదుపులోకి మంటలు, పరిస్థితి సాధారణం

కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగిన కొద్దిసేపట్లోనే మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. కాగా, ఈ ప్రమాదంలో టెంట్లు, కొన్ని వస్తువులు కాలిపోయాయని డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. పెద్దగా నష్టం జరగలేదని... జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఒక సర్వే కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

యూపీ సీఎం యోగీకి మోదీ ఫోన్.. కుంభమేళాలో అగ్ని ప్రమాదంపై ఆరా

కాగా, కుంభమేళాలో అగ్ని ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు.