ప్రయాగరాజ్ కుంభమేళా 2025 : పార్కింగ్ కోసమూ హైటెక్ టెక్నాలజీ
మహాకుంభ్ 2025 లో పార్కింగ్ డబ్బుల వసూలుకు కూడా హైటెక్ పద్దతిని ఉపయోగిస్తున్నారు. ఫాస్టాగ్ ద్వారా సులభమైన, వేగవంతమైన పార్కింగ్ సేవలను అందిస్తున్నారు.
మహాకుంభ్ నగర్ : ప్రయాగరాజ్ మహాకుంభ్ 2025 కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు... డిజిటల్, సాంకేతికతకు ఓ ఉదాహరణగా నిలుస్తుంది. ఈసారి ప్రయాగరాజ్ లో పార్కింగ్ వ్యవస్థను కూడా పూర్తిగా హైటెక్ గా తీర్చిదిద్దారు. కుంభమేళాలో మొదటిసారిగా ఫాస్టాగ్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు, దీని ద్వారా పార్కింగ్ ఫీజు చెల్లింపు ఇప్పుడు చాలా సులభం, ఆటోమేటిక్ గా ఉంటుంది.
ఆధునిక పార్కింగ్ వ్యవస్థ
మహాకుంభ్ కు లక్షలాది మంది భక్తులు వస్తారు... వారి సౌకర్యార్థం ప్రయాగరాజ్ మేళా అథారిటీ 101 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసింది. వీటిలో 9 పార్కింగ్ స్థలాలు సంగమం ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి, ఇక్కడ ఫాస్టాగ్ ఆధారిత ఆటోమేటిక్ ఫీజు వసూలు సౌకర్యం కల్పించబడుతుంది. ఢిల్లీకి చెందిన "పార్క్ ప్లస్" అనే సంస్థ ఈ పార్కింగ్ స్థలాలను నిర్వహిస్తుంది. అక్కడ AI ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేస్తారు, ఇవి వాహనాల ఎంట్రీ ఫీజు వసూలు చేయడంలో సహాయపడతాయి.
ఫాస్టాగ్ తో పార్కింగ్ ప్రక్రియ సులభతరం
ఇప్పుడు భక్తులు పార్కింగ్ ఫీజు కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఫాస్టాగ్ ద్వారా ఫీజు ఆటోమేటిక్ గా కట్ అవుతుంది, దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అయితే, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ ఫీజు నగదు లేదా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పార్కింగ్ లో సులభతరం చేయడమే కాకుండా ట్రాఫిక్ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
పార్కింగ్ ఛార్జీలు
ప్రయాగరాజ్ మేళా అథారిటీ వివిధ రకాల వాహనాలకు పార్కింగ్ ఛార్జీలను నిర్ణయించింది, అవి ఈ విధంగా ఉన్నాయి:
- సైకిల్: ₹5
- మోటార్ సైకిల్: ₹15
- కారు, ఈ-రిక్షా, ఆటో రిక్షా, ట్రాక్టర్-ట్రాలీ: ₹65
- ట్రక్, బస్సు, ఇతర భారీ వాహనాలు: ₹260
24 గంటల సౌకర్యం
పార్కింగ్ స్థలం మేనేజర్ చెప్పిన ప్రకారం... ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత వాహనాన్ని 24 గంటల వరకు నిలిపి ఉంచవచ్చు. ప్రస్తుతం, పార్కింగ్ స్థలాలు 12 గంటలు మాత్రమే తెరిచి ఉంటున్నాయి, కానీ మహాకుంభ్ ప్రారంభమైన తర్వాత అవి 24 గంటలు తెరిచి ఉంటాయి. పార్కింగ్ స్థలాలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు, వీటిలో CCTV కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు, వాహన మానిటరింగ్ వ్యవస్థలు ఉన్నాయి. దీనివల్ల భక్తుల వాహనాల భద్రతకు హామీ లభిస్తుంది. ఫాస్టాగ్ ఆధారిత పార్కింగ్ వ్యవస్థ కారణంగా ట్రాఫిక్ జామ్ సమస్య తగ్గుతుంది. భక్తులు వాహనాలను నిలిపి ఉంచడానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.