ప్రయాగరాజ్ మహాకుంభ్ 2025లో 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా. మరి ఇంతమంది జనాన్ని లెక్కిస్తారా? ఇందుకోసం ఉపయోగించే టెక్నాలజీ ఏమిటి?
ప్రయాగరాజ్ : ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ 2025కి ఈసారి 40 కోట్లకు పైగా జనం వస్తారని అంచనా. గత 2019 కుంభ్‌లో 26 కోట్ల మంది సంగమ స్నానం చేశారు. మహాకుంభ్ 2025లో పౌష పూర్ణిమ స్నానం అంటే మొదటి షాహీ స్నానంలో 5 కోట్ల మంది స్నానం ఆచరించారు. అయితే ప్రభుత్వం ఇలా ఇంత ఖచ్చితంగా కుంభమేళాలో పాల్గొన్నవారి లెక్కలు చెబుతుంటే మనకు అనుమానం రావడం ఖాయం. ఇన్ని కోట్ల జనాన్ని ఎలా లెక్కిస్తారు? ఈ లెక్కలమైనా ఊహాజనితమా లేక ఏదైనా ఖచ్చితమైన పద్ధతి ఉందా? అనే అనుమాలు సహజం. మరి కుంభమేళాలో పర్యాటకులను ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం.
మహాకుంభ్ జన లెక్కింపుకు ఏ పద్ధతి?
మారుతున్న కాలానికి అనుగుణంగా మహాకుంభ్ కూడా సాంకేతికతను అందిపుచ్చుకుంది. ప్రయాగరాజ్‌లో ఈసారి మహాకుంభ్ 2025కి వస్తున్న జన లెక్కింపు కోసం రియల్ టైమ్ అసెస్‌మెంట్ టీమ్‌ను నియమించారు. ఈ టీమ్ మహాకుంభ్‌కి వచ్చే జనాన్ని లెక్కిస్తుంది. దీనికోసం ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయం కూడా తీసుకుంటున్నారు.
కుంభమేళాకు వచ్చేవారి కోసం ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం మేళా ప్రాంతంలో 1800 కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో 1100 స్థిర కెమెరాలు, 744 తాత్కాలిక కెమెరాలు వున్నాయి. AI ఆధారిత హైటెక్ కెమెరాలతో ఫేస్ స్కానింగ్ ద్వారా లెక్కింపు జరుగుతుంది. ఒకే ముఖం పదే పదే కెమెరాలోకి వచ్చి లెక్కింపులో పొరపాటు జరగకుండా AI పనిచేస్తుంది.
డ్రోన్ కెమెరాలు కూడా ఈ వ్యవస్థతో అనుసంధానించబడి లెక్కింపులో సహాయపడుతున్నాయి. ఈ కెమెరాలు 360 డిగ్రీల కోణంలో పనిచేస్తాయి. జనం ప్రవాహం, ప్రాంతం, జన సాంద్రత, మొబైల్ ఫోన్‌ల లెక్కింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కింపు జరుగుతుంది. కుంభ్‌కి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకల డేటాను కూడా సేకరిస్తారు. నగరంలోని వాహనాలు, ట్రాఫిక్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. చివరి లెక్కలు ప్రకటించే ముందు అన్ని లెక్కలను సరిచూస్తారు.
గతంలో లెక్కింపు ఎలా జరిగేది?
గతంలో కుంభ్‌కి వచ్చే జనాన్ని మనుషులే లెక్కించేవారు. కుంభ్‌కి వచ్చే మార్గాల్లో అసెస్‌మెంట్ టీమ్‌లు ఉండి లెక్కించేవారు. రైళ్లు, బస్సుల్లో వచ్చే ప్రయాణికుల డేటా ఆధారంగా అంచనా లెక్కలు వెల్లడించేవారు. అయితే గతంలో కూడా కచ్చితమైన లెక్కలు తెలుసుకోవడం కష్టమే. మహాకుంభ్‌లో AI సాయంతో కూడా కచ్చితమైన లెక్కలు సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ప్రకటించే లెక్కలు కేవలం అంచనాలే.
