Prayagraj Kumbhmela 2025: సంగమ తీరంలో యోగి కేబినెట్ భేటీ!
జనవరి 22న అంటే రేపు బుధవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గ భేటీ త్రివేణి సంగమతీరంలో జరగనుంది. సంగమ స్నానం తర్వాత 54 మంది మంత్రులు, 130 మంది వీఐపీలు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్రయాగరాజ్ : మహా కుంభమేళా మరో ముఖ్యమైన కార్యక్రమానికి వేదిక కానుంది. జనవరి 22న రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశం త్రివేణి సంగమ ప్రాంతంలో జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 54 మంది మంత్రులు పాల్గొంటారు. వీరంతా కుంభమేళా ప్రాంతంలోనే పవిత్ర సంగమంలో స్నానం చేస్తారు.
130 మంది వీఐపీలు హాజరు, హోటళ్లు, సర్క్యూట్ హౌస్‌లలో బుకింగ్‌లు
కేబినెట్ సమావేశానికి రాష్ట్రంలోని 54 మంది మంత్రులతో పాటు 130 మంది వీఐపీలు ప్రయాగరాజ్‌కు చేరుకుంటారని భావిస్తున్నారు. వీరి కోసం నగరంలోని ప్రముఖ సర్క్యూట్ హౌస్‌లు, హోటళ్లలో గదులను ముందే బుక్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అందరు మంత్రులు, వీఐపీలు సంగమ స్నానం ఆచరించిన తర్వాత ఈ సమావేశంలో పాల్గొంటారని మహాకుంభ్ నగర్ డీఎం విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపారు.
ప్రస్తుతం ప్రయాగరాజ్‌లో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, స్వతంత్ర దేవ్ సింగ్, ఏకే శర్మ, నంద్ గోపాల్ గుప్తా నంది వంటి మంత్రులు ఇప్పటికే ఉన్నారు. మిగిలిన మంత్రులు జనవరి 22 నాటికి నగరానికి చేరుకుంటారు.
మహాకుంభ్‌లో ఇప్పటికే 9.25 కోట్ల మంది గంగా స్నానం
2025 మహాకుంభ్‌పై భక్తుల్లో అపారమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఆదివారం, సోమవారాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంగళవారం ఉదయం వరకు 4.96 లక్షల మంది భక్తులు సంగమంలో స్నానం ఆచరించినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 9.25 కోట్లకు పైగా భక్తులు గంగానది పవిత్ర స్నానం ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా వుండే అవకాశం వుందని కుంభమేళాలో భక్తులు, సాధుసంతులు చెబుతున్నారు.

