ప్రయాగరాజ్ కుంభమేళాలో తప్పిపోయినా భయం వద్దు..: యోగి సర్కార్ హైటెక్ సొల్యూషన్
ప్రయాగరాజ్ కుంభమేళా కోసం యోగి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే తప్పిపోయిన వారిని తిరిగి కుటుంబసభ్యులవద్దకు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
లక్నో : జాతర్లు, ఉత్సవాలకు పిల్లలను తీసుకెళ్లాలంటే తల్లిదండ్రులు భయపడుతుంటారు. జనసందోహంలో ఎక్కడ పిల్లలు తప్పిపోతారో అనేది వారి భయం. కానీ ప్రయాగరాజ్ లో వచ్చే ఏడాది జరగనున్న మహా కుంభమేళాలో ఆ భయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది యోగి సర్కార్. ప్రయాగరాజ్ మేళా అథారిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి హైటెక్ లాస్ట్ అండ్ ఫౌండ్ సిస్టం ఏర్పాటు చేశాయి. ఇది భద్రత, బాధ్యత, సాంకేతికత కలయిక. ఈ సిస్టం సాయంతో తప్పిపోయినవారిని చాలా ఈజీగా కుటుంబసభ్యుల వద్దకు చేర్చవచ్చు.
ఇక ‘కుంభమేళా తప్పిపోయిన సీన్లు ఉండవు
తిరనాళ్లలో తప్పిపోయి మళ్లీ పెద్దయ్యాక కలిసిపోయే సీన్లు సినిమాల్లో చూస్తుంటాం. కానీ ప్రయాగరాజ్ కుంభమేళాలో ఆ సీన్లు కనిపించవు. ఎందుకంటే డిజిటల్ రిజిస్ట్రేషన్ తో తప్పిపోయినవారిని ఆచూకీని కుటుంబసభ్యులు సులువుగా కనుగొనవచ్చు. లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లలో అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి.
కుంభమేళా 2025 లో డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లు ఉంటాయి. తప్పిపోయిన వారి వివరాలు ఇతర సెంటర్లకు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తారు. 12 గంటల్లో ఎవరూ క్లెయిమ్ చేయకపోతే పోలీసులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు.
భక్తులకు కొత్త భద్రతా వ్యవస్థ
పాత సినిమాల్లో కుంభమేళాలో తప్పిపోయినవారు కుటుంబసభ్యులను కలుస్తారా? లేదా? అనేది అదృష్టం మీద ఆధారపడివుండేది. కానీ ఇప్పుడలా కాదు... ప్రయాగరాజ్ కుంభమేళాలో లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లు, పోలీసులు వారి భద్రత చూసుకుంటారు. ముఖ్యంగా పిల్లలు, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలు లేదా మహిళలను ఎవరైనా క్లెయిమ్ చేస్తే ముందు వారి గుర్తింపుని ధృవీకరించుకోవాలి. ఏదైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
కుంభమేళాలో ఎవరైనా తప్పిపోతే సురక్షితంగా చూసుకుంటారు. పిల్లలు లేదా మహిళలను ఎవరైనా తీసుకెళ్లాలంటే వారి గుర్తింపుని ధృవీకరించుకోవాలి. ఈ కొత్త విధానంతో తప్పిపోయిన వారిని వెతికే ప్రక్రియ చాలా సులభతరం అవుతుంది.