Prayagraj Kumbhmela 2025 : కేవలం ఒక్కరోజులో కుంభమేళా ట్రిప్ పూర్తిచేసే చిట్కాలు, తక్కువ ఖర్చులో...
ప్రయాగరాజ్ కుంభమేళా 2025 ట్రావెల్ గైడ్ : కేవలం ఒక్క రోజు ట్రిప్ కోసం చిట్కాలు... బడ్జెట్, స్థలాలు, భద్రతా సూచనలు ఇంకా చాలా!
ట్రావెల్ డెస్క్ : జనవరి 13 నుండి జరుగుతున్న ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల్లో అంటే పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేసి తరించాలని భావిస్తున్నారు. కుంభమేళాలో జనసందోహం ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు 10 నుండడి 20 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది.
కేవలం భారతీయులే కాదు విదేశీ పర్యాటకులు కూడా ఈ మేళాకు భారీగా తరలి వస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో దేశంతో పాటు యావత్ ప్రపంచం దృష్టి కూడా ఈ మేళాపై ఉంది. దాదాపు 45 కోట్ల మంది కుంభమేళాకు వచ్చి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని అంచనా. మీరు కూడా మహా కుంభమేళా చూడాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఇప్పటికే ప్రయాగరాజ్ లోని హోటళ్ళన్ని నిండిపోయాయి. అంతేకాదు కుంభమేళా ప్రాంతంలో చలి తీవ్రత కూడా ఎక్కువగా వుంది. కాబట్టి రాత్రి అక్కడ గడపడం చాలా కష్టం. అందుకే ఒక రోజులో ప్రయాగరాజ్‌ని ఎలా చుట్టేయవచ్చో తెలుసుకుందాం.
ఒక్క రోజులో ప్రయాగరాజ్ చుట్టేయడం ఎలా?
ప్రయాగరాజ్‌ని ఒక రోజులో చుట్టేయవచ్చు. ఇందుకోసం మీరు సాధ్యమైనంత తక్కువ లగేజీ తీసుకెళ్లండి. గంగా ఘాట్ వరకు వాహనాలకు అనుమతి లేదు, కాబట్టి నడిచి వెళ్లాల్సిందే.
ఒంటరిగా ప్రయాణించకుండా ఒకరిద్దరు స్నేహితులతో కలిసి వెళ్లండి... ప్రయాణం బాగుంటుంది, లగేజీ బాధ్యత కూడా ఉండదు. మహా కుంభమేళా చూడటానికి ఉదయాన్నే వెళ్లండి, అప్పుడు ఒక రోజులో అన్ని ప్రదేశాలు చూడవచ్చు.
ప్రస్తుతం ప్రయాగరాజ్‌లో హోటళ్ళు నిండిపోయాయి. రోడ్డు మీదే రాత్రి గడపాల్సి రావచ్చు. కాబట్టి దుప్పటి, వెచ్చని దుస్తులు తీసుకెళ్లండి. మేళా నుండి దూరంగా హోటళ్ళు దొరుకుతాయి, కానీ అక్కడి నుండి మేళాకు చేరుకోవడానికి సమయం పడుతుంది.
ప్రయాగరాజ్‌లో చూడదగ్గ ప్రదేశాలు
ప్రయాగరాజ్ వచ్చారంటే త్రివేణి సంగమం నుండి మేళా చూడటం ప్రారంభించండి. తర్వాత అక్కడే బోటింగ్ చేయవచ్చు. కుటుంబంతో వెళితే చాలా ఆనందంగా ఉంటుంది. లేటా హనుమాన్ దర్శనం చేయకుండా మహా కుంభ స్నానం అసంపూర్ణమని అంటారు. దర్శనం తర్వాత నైనీ బ్రిడ్జి, చుట్టుపక్కల ప్రదేశాలు చూడవచ్చు. ప్రభుత్వం అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది
మహా కుంభమేళా ఖర్చు
మహా కుంభమేళాని ఒక రోజులో చుట్టేయవచ్చు. దీనికి 5-7 వేల రూపాయలు ఖర్చవుతుంది. ఇందులో ప్రయాణం, భోజనం, బస అన్నీ కలిసి ఉంటాయి. మీరు కొంచెం లగ్జరీగా గడపాలనుకుంటే బడ్జెట్ పెరుగుతుంది.