ఏమిటీ..! ప్రయాగరాజ్ కుంభమేళాలో లగ్జరీ డబుల్, ట్రిపుల్ బెడ్రూం టెంట్లా!!
2025 కుంభమేళా కోసం ప్రయాగరాజ్‌లో 300 పడకల డీలక్స్ డార్మిటరీ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఎలాంటి ఆధునిక వసతులు వుంటాయో తెలుసా? .
ప్రయాగరాజ్ మహా కుంభమేళా : ప్రయాగరాజ్‌లోని సంగమ నగరిలో మహా కుంభమేళా మహాపర్వం ప్రారంబానికి కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. ఈ కుంభమేళా కోసం యోగి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేస్తోంది. ఉత్తరప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ మేళా ప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో యాత్రికులు, పర్యాటకుల కోసం టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ టెంట్ లోనే డీలక్స్ వసతి కల్పిస్తూ 300 పడకల డార్మిటరీని ఏర్పాటు చేయనుంది.
ఏమిటీ 250-400 చదరపు అడుగుల టెంట్లా?
మహా కుంభమేళాకు వచ్చే విదేశీ పర్యాటకులు, ప్రత్యేక అతిథుల కోసం ప్రత్యేకంగా కొన్ని టెంట్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇవి సాధారణ యాత్రికుల కోసం ఏర్పాటుచేసే టెంట్ల కంటే ఎక్కువ పెద్దగా వుండి అన్ని సౌకర్యాలు కలిగివుంటాయి. ఇలా యూపీ పర్యాటక శాఖ ఏర్పాటు చేసే 300 పడకల డీలక్స్ డార్మిటరీలో ప్రతి టెంట్ 250 నుండి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ టెంట్లలో విల్లాలు, సూపర్ డీలక్స్ హోటల్స్ మాదిరిగానే ఏర్పాటు చేస్తుంది, తద్వారా పర్యాటకులు, యాత్రికుల బృందాలు కలిసి ఉండి ప్రపంచ స్థాయి సౌకర్యాలను పొందవచ్చు.
టెంట్లలో కల్పించే వసతులు
- ఈ టెంట్లలో ఏసి, డబుల్ బెడ్, మ్యాట్రస్, సోఫా సెట్, కస్టమైజ్డ్ ఇంటీరియర్స్, రైటింగ్ డెస్క్, ఎలక్ట్రిక్ గీజర్, దుప్పట్లు, దోమతెరలు, వైఫై, భోజన ప్రాంతం, కామన్ సిట్టింగ్ ఏరియా, వెయిటింగ్ లాంజ్, మీటింగ్ లాంజ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.
- యూపీఎస్టీడీసీ ఈ టెంట్లను అందించడంతో పాటు సంగం బోట్ రైడ్, సోఫా బోట్ రైడ్, బనానా బోట్ రైడ్, క్రూజ్ రైడ్, ప్రయాగరాజ్ సంగమంలో పూజలు, ఇతర పవిత్ర స్థలాలను సందర్శించడానికి ప్యాకేజీలను కూడా అందిస్తుంది.
- భోజనంలో టోస్ట్, పాలు-కార్న్‌ఫ్లేక్స్, పెరుగు, మొలకలు, తాజా పండ్లు, హాట్ చాక్లెట్ షేక్, పూరీ-కూర, దక్షిణ భారత వంటకాలు, వివిధ రకాల పరాఠాలు, థాలీలు, కూరలు, గ్రీన్ టీ, మసాలా టీ, టీ, కాఫీ వంటివి అందుబాటులో ఉంటాయి.
- ఈ ప్యాకేజీలలో యోగా, సాంస్కృతిక కార్యక్రమాల సమాచారం కూడా ఉంటుంది. ఈ టెంట్లను ప్రధానంగా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు నిర్వహిస్తారు.
- టెంట్ డార్మిటరీ బుకింగ్, ప్యాకేజీలు, ఇతర వివరాలను త్వరలో యూపీఎస్టీడీసీ వెబ్‌సైట్,మహా కుంభమేళా యాప్ లో చూడవచ్చు.