కుంభమేళా పొడిగింపు గురించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను అధికారులు ఖండించారు. మేళా ముందుగా నిర్ణయించిన సమయంలోనే ముగుస్తుందని స్పష్టం చేశారు.

Kumbh Mela : ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో భారీ భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం దీన్ని పొడిగిస్తోందనే ప్రచారం జరుగుతోంది. మార్చి వరకు కుంభమేళాను పొడిగించాయని సోషల్ మీడియాలో ఓ ప్రచారం బాగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై. ప్రయాగరాజ్ కలెక్టర్ రవీంద్ర మాండర్ క్లారిటీ ఇచ్చారు.

కుంభమేళా పొడిగింపు వదంతులను ఆయన ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని కలెక్టర్ స్పష్టం చేశారు. మహాకుంభమేళా ముగింపు షెడ్యూల్ ప్రకారం నిర్ణయించిన ముహూర్తానికే ముగుస్తుందన్నారు. ముందుగా ప్రకటించినట్లే ఫిబ్రవరి 26న కుంభమేళా ముగుస్తుందన్నారు. అప్పటివరకు వచ్చే భక్తులందరికీ సులభమైన రాకపోకలు కల్పిస్తున్నామన్నారు.

సులభమైన రాకపోకల ఏర్పాట్లు

మేళా పొడిగింపు గురించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై కలెక్టర్ స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులందరికీ సౌకర్యాలు, ఏర్పాట్లు చూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తరపున మేళా పొడిగింపు ప్రతిపాదన లేదని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

ఇక మిగిలిన రోజుల్లో ప్రజలకు సులభంగా స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సంగమంలో స్నానం చేసిన తర్వాత తమ గమ్యస్థానాలకు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ నిర్వహణ మా ప్రాధాన్యత అని, దానిపై నిరంతరం పనిచేస్తున్నామని, ప్రయాగరాజ్ సాధారణ జనానికి ఇబ్బంది కలగకుండా భక్తుల రాకపోకలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

రద్దీ రోజుల్లో ప్రయాగ సంగమ్ స్టేషన్ మూసివేత

రైల్వే స్టేషన్లను ముందస్తు సమాచారం లేకుండా మూసివేయలేదని, ఇది అవాస్తవమని కలెక్టర్ చెప్పారు. దారాగంజ్‌లోని ప్రయాగ సంగమ్ స్టేషన్‌ను పీక్ డేస్‌లో గతంలో కూడా మూసివేసేవారమని, ఈ స్టేషన్ మేళాకు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ జనం గుమికూడకుండా ఉండేందుకు దీన్ని శాశ్వతంగా మూసివేశామని తెలిపారు. మిగతా అన్ని స్టేషన్లు పనిచేస్తున్నాయని, అక్కడి నుంచి ప్రజలు వస్తున్నారని, వెళ్తున్నారని చెప్పారు.

ఇది ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి చారిత్రాత్మక సందర్భమని, ముఖ్యమంత్రి యోగి మార్గదర్శకత్వంలో అన్ని కార్యక్రమాలను సాధారణంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ వీంద్ర మాండర్ పేర్కొన్నారు.