కరోనా వైరస్ దేశంపై పూర్తిస్థాయిలో పంజా విసరక ముందే ఆ మహమ్మారిని పారద్రోలాలని భావించిన భారత ప్రభుత్వం దేశమంతా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఉన్నపళంగా లాక్ డౌన్ విధించడంతో ఒక్కసారిగా ప్రజల్లో భయాందోళనలు నెలకొని అందరూ కూడా రవాణ సదుపాయాలు లేక కాలినడకన వారి సొంత ఊర్లకు బయల్దేరారు. కొందరు చిక్కుబడిపోయారు. 

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తూ ఒక వీడియో ట్వీట్ చేసాడు. ఆ వీడియోలో వలస కూలీలు బంధింపబడి, తమను విడుదల చేయాలనీ రోదిస్తున్నారు. ఈ గుండెల్ని పిండేసే వీడియోను పోస్ట్ చేసి కరోనాను హ్యాండిల్ చేయడంలో నితీష్ కుమార్ విఫలమయ్యాడు అని రాసుకొచ్చాడు. 

"కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు అధికార యంత్రంగం నుండి మరో గుండెల్ని పిండేసే చర్య, దేశం నలుమూలల నుంచి వచ్చిన వలసకూలీలను కాపాడేందుకు నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన సోషల్ డిస్టెంసింగ్, క్వారంటైన్ ఇదే" అని ట్వీట్ చేసాడు ప్రశాంత్ కిషోర్. 

ఈ వీడియో బీహార్ సివాన్ పట్టణంలో షూట్ చేసిందిగా తెలియవస్తుంది. జర్నలిస్టులు ఆ వలసకూలీల వద్దకు వెళ్లి పరిస్థితి ఏమిటి అని అడగగా వారు తమను వదిలిపెట్టండంటూ బోరున విలపించడం వీడియో చూసిన వారందరిని కంటతడి పెట్టిస్తుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

ఇకపోతే.... పోలీసులు మాత్రం వారిని ఎలా కావాలంటే అలా వదిలిపెట్టలేమని, వారి డీటెయిల్స్ నమోదు చేసుకొని వారికి ఆహారాన్ని అందించిన తరువాత మాత్రమే వదులుతామని చెబుతున్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి చాలా మంది ఇలా తమ ఊర్లకు వెళ్ళడానికి క్యూలు కట్టిన విషయం తెలిసిందే. రవాణా సదుపాయాలు లేకపోతే వందల కిలోమీటర్లు కూడా ఇలా నడుచుకుంటూ వెళుతున్నారు జనాలు. 

భారతదేశంలో కూడా కరోనా కేసులు అధికమవుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పవచ్చు. ఇక  మాట్లాడే మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని ఈ విషయమై స్పందించారు. 

ఆదివారం నాడు ఆయన మన్‌కీ బాత్ లో ప్రజలతో మాట్లాడారు.కరోనాపై ప్రభుత్వం  విధించిన లాక్‌డౌన్ గురించి ఆయన చర్చించారు. పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకొన్నారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఈ రకమైన కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. 

లాక్‌డౌన్ నిబంధనలను కొందరు ఉల్లంఘిస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఆయన వివరించారు.

భారత్ కు ఇది జీవన్మరణ సమస్య అని ఆయన చెప్పారు. కరోనాపై వైద్య సిబ్బంది నిరంతరం పోరాటం చేస్తున్నారని ఆయన వారిని అభినందించారు. 
లాక్ డౌన్ సమయంలో పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులు, కిరాణ వ్యాపారులు, ఈ -కామర్స్ డెలివరీ సిబ్బంది, ఐటీ రంగంలోని వ్యక్తులను ప్రధాని ప్రశంసించారు. 

also read:గుజరాత్‌లో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరిక: అహ్మదాబాద్‌లో ఒకరి మృతి

హోం క్వారంటైన్ లో ఉండాలని సలహ ఇచ్చినవారి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఉదంతాలు తన దృష్టికి రావడంతో తాను బాధపడినట్టుగా మోడీ గుర్తు చేశారు.ప్రపంచ పరిస్థితులు చూసిన తర్వాతే దేశంలో లాక్ డౌన్ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు.

కరోనా వ్యాప్తి చెందకుడా ఉండాలంటే ప్రజలంతా లక్ష్మణరేఖను మరికొన్ని రోజులు పాటించాల్సిందేనని ప్రధాని కోరారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన ప్రజలను కోరారు.