న్యూఢిల్లీ: ఢిల్లీ శానససభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయంలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ నెల 18వ తేదీన ఏం ప్రకటన చేయబోతున్నారనే ఉత్కంఠకు తెర లేపారు. తాను ఈ నెల 18వ తేదీన బిగ్ అనౌన్స్ మెంటే చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఆ బిగ్ అనౌన్స్ మెంట్ ఏమిటనే ఉత్కంఠను ఆయన రేకెత్తించారు. 

ఫిబ్రవరి 11వ తేదీ తర్వాత తాను ఏదో కీలకమైన ప్రకటన చేయబోతున్నట్లు అందరూ ఎదురు చూశారని, కానీ, వారందరికీ నిరాశే మిగిలిందనుకుంటానని ఆయన అన్నారు. అయితే, ఫిబ్రవరి 18వ తేదీన తాను బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నానని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఓ జాతీయ మీడియాతో ఆయన ఆ విషయం చెప్పారు. 

Also Read: కేసీఆర్ ఆశలు గల్లంతు: ప్రశాంత్ కిశోర్ వ్యూహం ముందు ఢీలా

దాంతో ప్రశాంత్ కిశోర్ చేయబోయే భారీ ప్రకటనపై అప్పుడే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. జాతీయ స్థాయిలో ఆయన బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు కోసం, తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకె కోసం ఆయన పనిచేయడానికి ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఇప్పటికీ వైఎస్ జగన్ తో కలిసి పనిచేస్తున్నారు. మరోవైపు నితీష్ కుమార్ ను బీహార్ లో గద్దె దింపడానికి కూడా ఆయన పనిచేయవచ్చునని అంటున్నారు. కాంగ్రెసు, ఆర్జెడీలను ఏకం చేసి, తగిన వ్యూహరచన చేసి అమలు చేయడం ద్వారా జేడీయు, బిజెపి కూటమిని దెబ్బ తీయాలనేది ఆయన ప్లాన్ గా చెబుతున్నారు. 

Also Read: దేశ రాజధానిలో పాగా వేసిన ఆప్.... జాతీయ రాజకీయ పావులను కూడా కదపటం మొదలెట్టేసింది

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ, కాంగ్రెసు పార్టీలను ఏకం చేసి ఆయన పనిచేసే అవకాశాలున్నాయని అంటున్నారు. బిఎస్పీ అధినేత మాయావతిని దూరం పెట్టాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. తద్వారా జాతీయ స్థాయిలో కీలకమైన రాష్ట్రాల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను నిలబెట్టి, వచ్చే లోకసభ ఎన్నికల నాటికి బిజెపికి వ్యతిరేకంగా బలమైన ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేస్తారని అంటున్నారు. 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహార శైలితో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. జేడీయు ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ కిశోర్ ను నితీష్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ విషయాలు గురించి మాట్లాడుతానని ఆయన గతంలో అన్నారు. 11వ తేదీన ఫలితాలు వెలువడినప్పటికీ ఆయన ఏమీ మాట్లాడలేదు. దీంతో తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రశాంత్ కిశోర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల18వ తేదీన బిగ్ అనౌన్స్ మెంట్ చేస్తానని చెప్పారు.