కేసీఆర్ ఆశలు గల్లంతు: ప్రశాంత్ కిశోర్ వ్యూహం ముందు ఢీలా
కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఆ పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెసు బలం, వ్యూహం పనిచేయడం లేదు. ఈ స్థితిలో ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ కు తానే నాయకత్వం వహిస్తానని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. అయితే, ఆ అవకాశం ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ కు ఇస్తారా అనేది సందేహమే.
బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమిని లేదా ఫెడరల్ ఫ్రంట్ ను నడిపించే బాధ్యతను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భుజాన మోసే అవకాశం ఉంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం ద్వారా దాదాపుగా ఆయన ఆ సంకేతాలను ఇచ్చారు
తొలుత రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల చేతుల్లోంచి జారిపోకుండా జాగ్రత్త పడుతూ వస్తూ వచ్చే లోకసభ ఎన్నికలనాటికి అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే దిశగా ప్రశాంత్ కిశోర్ సాగుతున్నట్లు అర్థమవుతోంది. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసుకు, స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకెకు ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల కూటమికి ఇప్పటి నుంచే ప్రశాంత్ కిశోర్ పాదులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెసు బిజెపిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మమతా బెనర్జీని ఓడించేందుకు అవసరమైన వ్యూహాన్ని బిజెపి ఆ రాష్ట్రంలో అనుసరిస్తోంది. దాన్ని తిప్పికొట్టడానికి అవసరమైన వ్యూహాన్ని ప్రశాంత్ కిశోర్ రూపొందించి తృణమూల్ తిరిగి అధికారంలోకి రావడానికి ఉపయోగపడాల్సి ఉంటుంది. ఢిల్లీ చేజారకుండా చేసిన ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్ బిజెపికి దక్కకుండా చూడాల్సి ఉంటుంది
తమిళనాడు విషయానికి వస్తే, డిఎంకెకు విజయం అంత సులభమైన విషయమేమీ కాదు. అక్కడ బహుముఖ పోటీలు జరిగే అవకాశం ఉంది. అన్నాడియంకెతో పాటు కమల్ హాసన్ పార్టీ కూడా పోటీలో ఉంటుంది. అలాగే రజనీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారు. రజినీకాంత్ బిజెపికి సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎన్నికలనాటికి ఏం చేస్తారనేది తెలియదు. పిఎంకె వంటి ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. తమిళనాడులో ప్రశాంత్ కిశోర్ భిన్నమైన వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే వైఎఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తేవడంలో ప్రశాంత్ కిశోర్ కీలకమైన భూమిక పోషించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన వైసీపీ కోసం పని చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికీ ప్రశాంత్ కిశోర్ జట్టు వైఎస్ జగన్ తో కలిసి పనిచేస్తోంది. అందువల్ల జగన్, ప్రశాంత్ కిశోర్ ల బంధం కొనసాగే అవకాశం ఉంది
వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ప్రస్తుతం టీడీపీ ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి, వైఎస్ జగన్ కు మధ్య ప్రధానంగా పోరు జరుగుతోంది. బిజెపి కూడా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకుంది. పవన్ కల్యాణ్ కున్న ప్రజాదరణ, తమ వ్యూహాలతో బిజెపి జగన్, చంద్రబాబులను ఎదుర్కోవాలని చూస్తోంది.
ఏపీ రాజకీయాలను గమనిస్తే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రాంతీయ పార్టీలో కూటమిలో ఉండకపోవచ్చు. అయితే, పరిస్థితిని బట్టి చంద్రబాబు తన వైఖరి మార్చుకోవచ్చు . అయితే జగన్ ఆ కూటమిలో ఉంటే చంద్రబాబు వస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే, చంద్రబాబు తన వైఖరి మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. బయటి నుంచైనా మద్దతు ఇవ్వవచ్చు
తెలంగాణ రాష్ట్రానికి వస్తే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఆ పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెసు బలం, వ్యూహం పనిచేయడం లేదు. ఈ స్థితిలో ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ కు తానే నాయకత్వం వహిస్తానని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. అయితే, ఆ అవకాశం ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ కు ఇస్తారా అనేది సందేహమే. అయితే, ప్రాంతీయ పార్టీలు బిజెపిని ఎదుర్కునే కేంద్రంలో అధికారానికి వచ్చే పరిస్థితి ఉంటే కేసీఆర్ అటువైపు మొగ్గు చూపవచ్చు.
కేసీఆర్ తన కుమారుడు కేటీ రామారావుకు ముఖ్యమంత్రి పదవి అప్పగించి జాతీయ రాజకీయాలకు వెళ్లాలని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో బిజెపి తిరుగులేని ఆధిక్యత సాధించడం వల్ల కేసీఆర్ వ్యూహం ఫలించలేదు. అయితే, వచ్చే ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమి నిలబడగలిగితే ఆయన అటు మొగ్గు చూపవచ్చు. లేదా బిజెపికి తాను మద్దతు ఇస్తే సరిపోతుందని భావిస్తే అలా కూడా చేయవచ్చు. ఇప్పటికిప్పుడైతే కేసీఆర్ ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేసే అవకాశం లేదు
కేసీఆర్ కు సంబంధించి రెండు పరిమితులు ఉన్నాయి. ఒకటి... కాంగ్రెసును కలుపుకుని వెళ్లాలని మమతా బెనర్జీ, స్టాలిన్ తదితర ప్రాంతీయ పార్టీల నాయకులు భావిస్తున్నారు. కేసీఆర్ బిజెపితో పాటు కాంగ్రెసును వ్యతిరేకిస్తున్నారు. మరోటి.. ఫెడరల్ ఫ్రంట్ కు నాయకత్వం వహించాలని అనుకోవడం. కేసీఆర్ నాయకత్వాన్ని మమతా బెనర్జీ, తదితర నాయకులు అంగీకరించే అవకాశం లేదు. ఇప్పటికే కేసీఆర్ ను ప్రాంతీయ పార్టీలు దూరం పెడుతున్నాయి.
సీఏఏకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులకు లేఖలు వెళ్లాయి. ఈ లేఖలు కేరళ ముఖ్యమంత్రి పినరయి రవి తదితరులకు వెళ్లాయి. కానీ కేసీఆర్ కు ఆ లేఖ రాలేదు. కేసీఆర్ ను ఇతర ప్రాంతీయ పార్టీలు నమ్మే పరిస్థితి లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. కేసీఆర్ ను ఏకాకిని చేసే వ్యూహాన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు అనుసరిస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది
ప్రశాంత్ కిశోర్ బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తారా అనే సందేహం మరొకటి మిగిలింది. ఆయన బిజెపికి వ్యతిరేకంగా కచ్చితమైన వైఖరిని తీసుకున్నారనేది బహిరంగ రహస్యమే. సీఏఏకు వ్యతిరేకంగా ఆయన తన గొంతు వినిపించారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే అంశం కూడా సీఏఏనే కావడం విశేషం. సీఏఏపై ప్రశ్నించినందుకు, బిజెపితో కలిసి నడవడాన్ని వ్యతిరేకించినందుకే ఆయన నితీష్ కుమార్ ఆగ్రహానికి గురై జేడీయు నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ స్థితిలో భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల కూటమిని నడిపించేందుకు అవసరమైన వ్యూహాలను రచించి ప్రశాంత్ కిశోర్ అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది