ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో సినీ నటుడు రజనీకాంత్ భేటీ అయ్యారు. కాగా... వీరి భేటీ ప్రస్తుతం తమిళనాడు  రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆయనను ఓ రాజకీయ నాయకుడిగా చూడాలని అభిమానులు కూడా ఎంతగానో కోరుకుంటున్నారు. అయితే... ఎప్పటి కప్పుడు  ఈ విషయం గురించి రజనీకాంత్ వాయిదా వేస్తూ వస్తున్నారు.

సొంతంగా పార్టీ పెడతారని కొందరు.. ఏదైనా పార్టీలో చేరతారంటూ మరికొందరు చర్చించుకుంటున్నప్పటికీ.. దీనిపై ఆయన నోరు విప్పలేదు. కానీ అభిమానుల వత్తిడి మేరకో, లేక తన ఆలోచనల మేరకో ఎట్టకేలకు రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్‌లో ప్రకటించాడు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజా సంఘాలుగా పేరు మార్చారు. 

అభిమానులతో భేటీ అయ్యి వారికి రాజకీయపరమైన దిశా నిర్ధేశం చేశారు. అభిమాన సంఘాల్లో ముఖ్యమైన వారికి నిర్వాహకులుగా బాధ్యతలను అప్పగించారు. తమిళనాడులో కోటికి పైగా సభ్యుత్వాన్ని నమోదు చేయాలని కూడా లక్ష్యంగా నిర్దేశించారు.ఇక ఎన్నికలకు వెళ్లడమే తరువాయి అన్న తరుణంలో పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చాయి. అయితే ఆ ఎన్నికలకు రజనీకాంత్‌ దూరంగా ఉండటం అభిమానుల్ని నిరాశ పరచింది. అయితే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా, రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలన్న రజనీ నిర్ణయంతో ఆయన అభిమానులు కాస్త సంతోషించారు.

తాజాగా... ఆయన ప్రశాంత్ కిశోర్ తో భేటీ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందకు వెళ్లాలి అన్న విషయంపై ప్రశాంత్ కిశోర్... రజనీకాంత్ కి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్ ఎవరి కోసం పనిచేస్తే.. వాళ్లు ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది. అందుకే రజనీ ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది.