దేశ రాజధాని డిల్లీలో స్వల్పంగా భూమి కంపించింది. మయన్మార్ లో సంభవించిన భూకంప ప్రభావం డిల్లీలో కనిపించింది.
Earthquake : ఇటీవల కాలంలో భూకంపాలు పెరిగిపోయాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తరచూ భూమి కంపిస్తోంది. తాజాగా మయన్మార్ లో భూకంపం సంభవించింది. శుక్రవారం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7 గా ఉంది. ఈ భూకంప తీవ్రత డిల్లీలో కనిపించింది.
ఇక ప్రముఖ పర్యాటక దేశం థాయలాండ్ లో కూడా భూకంపం సంభవించింది. ఆ దేశ రాజధాని బ్యాంకాక్ లో భూమి కంపించింది. ఇక్కడ రిక్టర్ స్కేలుపై 7.3 గా భూకంప తీవ్రత నమోదయ్యింది. ఒక్కసారిగా భూమి కదలడంతో భయాందోళనకు గురయిన స్థానికులు ఇళ్లలోంచి బయటకు పరుగు తీసారు.
మయన్మార్ లో భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో భవనాలు కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఇలా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది మరి ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వరుసగా రెండుసార్లు మయన్మార్ లో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. మొదట 7.7 తీవ్రతతో, తర్వాత 6.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప కేంద్రం మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.
అయితే నిన్న(గురువారం) భారత్ లో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సంగ్రౌలిలో 3.5 తీవ్రతతో భూమి కంపించింది. మద్యాహ్నం 4.48 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
