అస్సాం: ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన వైద్య వృత్తిలో వున్న ఓ డాక్టర్ ఓ నిరుపేద బాలుడి పట్ల అత్యంత కర్కషంగా వ్యవహరించి తీవ్రంగా గాయపర్చిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. మైనర్ బాలుడితో చట్టవిరుద్దంగా తన ఇంట్లో వెట్టిచాకిరీ చేయించుకోవడమే కాకుండా అతడిపై సలసలకాగే వేడినీటిని  అతడిపై చల్లి అత్యంత దారుణంగా వ్యవహరించాడు సదరు డాక్టర్. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. డిబ్రూగర్ లోని అస్సాం మెడికల్ కాలేజ్ ఆండ్ హాస్పిటల్ లో సిద్దిప్రసాద్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య మిథాలీ ఓ కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. ఇలా బాధ్యాతయుతమైన వృత్తుల్లో ఈ  దంపతులు ఓ చిన్నారి విషయంలో దారుణంగా వ్యవహరించారు. 

read more  వాచ్ మెన్ ను కారుతో తొక్కేసిన యువతి.. ఇంటికి వెళ్లి..

12ఏళ్ల బాలుడిని తమ ఇంటి పనుల కోసం నియమించుకున్న ఈ దంపతులు అతడిచేత వెట్టిచాకిరి చేయించుకునేవారు. ఇలా చట్టవ్యతిరేకంగా మైనర్ బాలుడితో చాకిరీ చేయించుకోవడమే కాకుండా తాజాగా అతడిని తీవ్రంగా గాయపర్చారు. నిద్రిస్తున్న బాలుడిపై సలసలకాగే వేడినీటిని పోసి ఈ దంపతులు రాక్షసుల్లా వ్యవహరించారు. వారి వికృత చేష్టలతో పాపం బాలుడికి తీవ్ర గాయాలవగా కనీసం వైద్యసాయం అందించడానికి కూడా ముందుకురాలేదు ఈ కసాయి డాక్టర్. 

అయితే ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఈ దంపతులను అరెస్ట్ చేశారు. వారిపై బాలకార్మిక చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు కోలుకున్నాక చైల్డ్ కేర్ సెంటర్లో చేర్చారు పోలీసులు.