తమ అపార్ట్ మెంట్ వాచ్ మెన్ ని ఓ యువతి కారుతో తొక్కేసింది. అతను ఆ కారు కింద పడి చనిపోయిన తర్వాత.. తనకు ఏమీ తెలీనట్లు ఇంటికి వెళ్లి పడుకొని నిద్రపోయింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నై నగరంలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో 68ఏళ్ల శివప్రకాశం అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అదే కాంప్లెక్స్‌లో ఉండే ఓ 18ఏళ్ల యువతి తన ఆడికారులో బుధవారం అర్థరాత్రి ఇంటికి తిరిగొచ్చింది. ఆ సమయంలో అక్కడ నేలపై నిద్రిస్తున్న శివప్రకాశాన్ని కారుతో తొక్కేసింది. ఆ తర్వాత ఇంటికెళ్లి పడుకుంది. 

వాచ్‌మెన్ శవాన్ని చూసిన వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజి పరిశీలించి సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. వాచ్‌మెన్‌ను కారుతో తొక్కిన విషయం తనకు తెలియదని చెప్పింది. సీసీటీవీ ఫుటేజీ చూస్తేగానీ ఆమెకు అసలు విషయం తెలియలేదట. నిర్లక్ష్యంతో వ్యక్తి చావుకు కారణమైనట్లు ఆమెపై పోలీసులు కేసు నమోదుచేశారు.