విధి నిర్వహణలో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతంలో 30 ఏళ్లుగా 15 కిలోమీటర్లు నడుస్తూ ఉత్తరాలను చేరవేసిన పోస్ట్‌మాన్ డీ. శివన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయిపోయారు. పలువురు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త, బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్.. శివన్‌ను ఆకాశానికెత్తేశారు. ‘‘ ప్రభుత్వంలో అంకిత భావం, బాధ్యత ఉందనడానికి ఆయన అద్భుతమైన ఉదాహరణ.. శివన్ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసిన ఐఏస్ ఆఫీసర్ సుప్రియా సాహుకి రాజీవ్ ధన్యవాదాలు తెలిపారు.

జూలై 9న ఇందుకు సంబంధించి ట్వీట్ చేసిన ఆయన తాజాగా శివన్ నిజాయితీని సత్కరించాలని భావించారు. దీనిలో భాగంగా దేశానికి ఆయన చేసిన సేవలకు గాను లక్ష రూపాయల బహుమతిని ఇస్తున్నట్లు రాజీవ్ ప్రకటించారు.

తమిళనాడులోని పోస్టల్ శాఖలో 30 ఏళ్లుగా పోస్ట్‌మాన్‌గా పనిచేస్తున్న శివన్ ఉద్యోగ విరమణ చేసే వరకు దట్టమైన అటవీ ప్రాంతంలో విధులు నిర్వహించేవారు. ప్రతిరోజూ ఏనుగులు, ఎలుగు బంట్లను దాటుకుంటూ ప్రవాహాలు, జలపాతాలను అధిగమించి 15 కిలోమీటర్లు కాలినడకన వెళ్లేవారు.

ఆ మార్గంలో ఉన్న వారికి ఉత్తరాలు, పెన్షన్ సొమ్మును అందిస్తూ వచ్చేవారు. ఉద్యోగ విరమణ చేసే వయస్సులోనూ తన విధుల పట్ల అంకిత భావాన్ని చూపుతూ వచ్చిన శివన్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ విషయాన్ని ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.