Asianet News TeluguAsianet News Telugu

గోవా కుర్చీ కోసం బీజేపీ కాంగ్రెస్ సై

గోవాలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తరచూ విధులకు దూరమవుతున్నారు. గత కొద్దిరోజుల క్రితం విదేశాల్లో శస్త్ర చికిత్స చేయించుకున్నపారికర్ ఇటీవలే మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. 

political heat in goa
Author
Goa, First Published Sep 19, 2018, 4:23 PM IST

గోవా: గోవాలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తరచూ విధులకు దూరమవుతున్నారు. గత కొద్దిరోజుల క్రితం విదేశాల్లో శస్త్ర చికిత్స చేయించుకున్నపారికర్ ఇటీవలే మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

మనోహర్ పారికర్ తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే గోవాలో ప్రస్తు రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నెమ్మదిగా పావులు కదుపుతోంది. ఇటీవలే గవర్నర్ మృదుల సిన్హాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు. 

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని అడ్డుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ సీఎం పీఠం కోసం చేస్తున్న ప్రయత్నాలతో గోవా రాజకీయం రసకందాయంలో పడింది.

2017 మార్చి 14న గోవా ముఖ్యమంత్రిగా మనోహర్‌ పారికర్‌ బాధ్యతలు చేపట్టారు. అయితే పారికర్ గత కొంతకాలంగా ప్యాంక్రియాటిక్‌ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో వైద్య చికత్స నిమిత్తం తరచూ విధులకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య మూడు నెలల పాటు అమెరికాలో చికిత్స తీసుకుని వచ్చారు. తాజాగా మరోసారి అనారోగ్యానికి గురవడంతో చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఎయిమ్స్ లో పారికర్ చికిత్స పొందుతున్నారు. 

ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మనోహర్ పారికర్ పాలనాబాధ్యతలను ఎవరికీ అప్పగించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పారికర్‌తో పాటు రాష్ట్రంలో మరికొందరు మంత్రులు కూడా అనారోగ్యంతో విధులకు దూరమయ్యారు. ఉపముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఫ్రాన్సిస్‌ డిసౌజా న్యూయార్క్‌లో చికిత్సపొందుతుండగా, విద్యుత్‌ శాఖ మంత్రి పాండురంగ్‌ మకైకర్‌ బ్రెయిన్‌స్ట్రోక్‌ తో బాధపడుతున్నారు. దీంతో గోవాలో పాలన కుంటుపడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సీఎం పారికర్ తరచూ అనారోగ్యం పాలవ్వడం...మంత్రులు కూడా పాలనపై దృష్టిసారించకపోవడం, సీఎం పాలనా పగ్గాలు ఇతరులకు అప్పగించకపోవడం వంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో పాలనా వ్యవస్థ దెబ్బతింటోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేనందున ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది.

అతిచిన్న రాష్ట్రమైన గోవాలో మెుత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14, కాంగ్రెస్‌ 16 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్ర వాదీ గోమంతక్‌ పార్టీ 3, గోవా ఫార్వర్డ్‌ పార్టీ 3 చోట్ల గెలుపొందాయి. అలాగే ఒక చోట ఎన్‌సీపీ, మూడు చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 16 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 

బీజేపీ వ్యూహాలతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమమైంది. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. 

అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తోంది. గోవా అసెంబ్లీలో 21 మంది సభ్యుల మద్దతు తమ పార్టీకి ఉందంటూ తాజాగా కాంగ్రెస్‌ పేర్కొంటోంది. ఇప్పటికే అసెంబ్లీలో బలపరీక్షకు అనుమతివ్వాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం సైతం అందించింది.

ఇదిలా ఉంటే ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న పారికర్ ఉపముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాలని మహారాష్ట్ర గోమంతక్ పార్టీకి చెందిన ధవలైకర్‌ను కోరినట్లు తెలుస్తోంది. దీంతో పారికర్‌ నిర్ణయంపై మరో మిత్రపక్షమైన గోవా ఫార్వర్డ్‌ పార్టీ అసంతృత్తి వ్యక్తం చేస్తోంది. ధవలైకర్‌ను డిప్యూటీ సీఎంగా జీఎఫ్‌పీ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో మిత్ర పక్షాల మధ్య విభేదాలు తలెత్తడం బీజేపీకి తలనొప్పిగా మారింది.

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గోవాలో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతుండటంతో అప్రమత్తమైన అమిత్ షా రంగంలోకి దిగారు. 

గోవాలో సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు పార్టీ నేతలతో చర్చలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే గోవా ఫార్వర్డ్‌కు చెందిన ఎమ్మెల్యే విజయ్‌ సర్దేశాయ్‌తో అమిత్‌షా చర్చించినట్లు సమాచారం. మళ్లీ పార్టీ నేతలతో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారని తెలుస్తోంది.  

గత కొద్దిరోజులుగా గోవా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సీఎం పీఠం కోసం ఎత్తుకుపై ఎత్తులు వేస్తోంది. అయితే ఈ రాజకీయ పోరులో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేజిక్కుంచుకుంటోందా అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో కనబడుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios