మహారాష్ట్రలో పోలీసులు పండ్లు అమ్మేవారి, ఆటో డ్రైవర్ల అవతారమెత్తారు. ఏ పనీ లేని వారిలా వీధిలో తచ్చాడారు. ఇదంతా ఓ చైన్ స్నాచర్‌ను పట్టుకోవడానికి కొన్ని వారాలపాటు నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్. చైన్ స్నాచర్ కోసం ఇంత స్కెచ్చా? అనే డౌటు రావొచ్చు. దానికీ పోలీసులు ఈ విధంగా వివరణ ఇచ్చారు.
ముంబయి: వారంతా పోలీసులు. కానీ, మారు వేషాల్లో వీధిలో ఏ పనీ లేని వారిలా చక్కర్లు కొట్టారు. కొందరు పళ్లు అమ్మారు. ఇంకొందరు ఆటో నడుపుతూ ఎవరూ గుర్తు పట్టలేకుండా మారారు. ఇంకొందరు అసలు తమకు ఏ ఆవాసమూ లేదన్నట్టుగా నిరాశ్రయులుగా నటించారు. ఇదంతా ఒక రహస్య ఆపరేషన్. మహారాష్ట్ర పోలీసులు ఓ చైన్ స్నాచర్‌ను పట్టుకోవడానికి ఈ ప్లాన్ వేశారు. చైన్ స్నాచర్‌ను పట్టుకోవడానికి ఇంతటి శ్రమ అవసరమా? అనే ప్రశ్న కూడా వస్తుంది. అక్కడ ఓ కమ్యూనిటీ హద్దు మీరి ప్రవర్తిస్తూ ఉంటుంది. తమ కమ్యూనిటీకి చెందిన వారిని ఎవరిని అరెస్టు చేసినా పోలీసులపైనే దాడి చేసిన ఉదంతాలు ఉన్నాయి. అందుకే ఈ సారి ఓ చైన్ స్నాచర్‌ను అరెస్టు చేసినప్పుడు అలాంటి ఘటనలు పునరావృతం కావద్దనే ఉద్దేశంతోనే మహారాష్ట్ర పోలీసులు పాల్‌గడ్ జిల్లాలో ఈ రహస్య ఆపరేషన్‌కు తెరలేపారు.
నిందితుడు అబ్బాస్ అంజద్ ఇరానీ (24)ను అరెస్టు చేయడానికి అతడు నివసించే ప్రాంతంలో ఒక పోలీసు టీం కొన్ని వారాలపాటు వేరువేరు వేషధారణలో గడుపుతూ జాగరూకతగా ఉన్నట్టు వాసాయి విరారర్ పోలీసు క్రైమ్ యూనిట్ III సీనియర్ ఇన్‌స్పెక్టర్ షాహురాజ్ రనవారే శుక్రవారం తెలిపారు. ఇరానీ తరచూ వెళ్లే రెస్టారెంట్‌కు కూడా తమ టీమ్ సభ్యులు వెళ్లి పరిశీలించినట్టు వివరించారు.
ఈ నెల తొలివారంలో ఇరానీని ఒంటిగా తాము ట్రేస్ చేయగలిగామని, ఓ ఆటోలో అతడిని బలవంతంగా ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు తెలిపారు.
ఇరానీ అరెస్టుతో ఆ జిల్లాలో కనీసం ఏడు చైన్ స్నాచింగ్ కేసులను డిటెక్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు. ఓ మోటార్ బైక్‌ను, రూ. 3.31 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేసుకున్నట్టు వివరించారు.
ఇరానీ గతంలోనూ వ్యవస్థీకృత నేరాన్ని కట్టడి చేసే ఎంసీవోసీఏ కింద రెండు సార్లు అరెస్టు అయ్యాడు. థానే పోలీసుల పరిధిలో 21 కేసులను అతను ఎదుర్కొంటున్నాడు.
