కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత.... రూల్స్ అతిక్రమిస్తున్నారంటూ ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించడం కామన్ గా మారింది. మొన్నటికి మొన్న ఓ ఎండ్ల బండికి కూడా రూ.వెయ్యి చాలానా విధించారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. స్కూల్ కి సైకిల్ మీద వెళ్తున్న స్టూడెంట్ ని హెల్మెట్ లేదని ఓ పోలీసు ఆపేశాడు. కాగా... దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

 పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం  ధర్మపురి జిల్లా పెన్నాగరం మండలం ఏరియా పోలీసు స్టేషన్‌ పరిధిలో ప్రత్యేక అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌ సుబ్రమణి నేతృత్వంలో పోలీసులు మంగళవారం వాహనాల తనిఖీ చేశారు. హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్న వారిని పట్టుకుంటున్నారు. ఆ సమయంలో పాఠశాల విద్యార్థి ఆ మార్గంలో సైకిల్‌పై వెళ్తుండగా ఓ కానిస్టేబుల్‌ ఆ విద్యార్థిని ఆపి సైకిల్‌కు తాళం వేసి, రోడ్డు పక్కన పెట్టారు.
 
అసలు తనను ఎందుకు ఆపారో తెలియక ఆ విద్యార్ధి అయోమయానికి గురయ్యాడు. అయితే హెల్మెట్‌ లేదని, జరిమానా చెల్లించమని ఆ విద్యార్థికి కోరినట్లు తెలుస్తోంది. ఏం చేయాలో తెలియక ఆ విద్యార్థి తల్లిదండ్రులకు సమాచార మిచ్చాడు. అనంతరం గంటపాటు రోడ్డుపైనే నిలబెట్టి, సైకిల్‌ని, విద్యార్థిని విడిచిపెట్టారు. ఇది అక్కడే ఉన్న ఒక భవనంపై నుంచి వీడియో తీయడంతో విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, ఆ విద్యార్ధి రెండు చేతులతో హ్యాండిల్‌ వదిలేసి సైకిల్‌ తొక్కు కుంటూ రావడాన్ని గమనించి, అతనిని హెచ్చరించేందుకు అడ్డుకున్నట్లు పోలీసుల వర్గాలు చెబుతున్నాయి.