చాలా మంది అబ్బాయిలు.. అమ్మాయిలను ప్రేమ పేరిట మోసం చేసి శారీరకంగా వాడుకుంటారు. లేదంటే.. వారి దగ్గర ఉన్న డబ్బు, నగదు కాజేస్తారు. అయితే... ఈ వ్యక్తి మాత్రం కేవలం హిజ్రాలను మాత్రమే టార్గెట్ చేసుకుంటాడు.

హిజ్రాలే లక్ష్యంగా వారిని ప్రేమిస్తూ నగలు, నగదు చోరీ చేస్తున్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానిక అమింజికరైకు చెందిన హిజ్రా ప్రియాంకకు పుళల్‌ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ హుస్సేన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 

తాను నౌకలో కెప్టెన్‌గా పనిచేస్తున్నానంటూ పరిచయం చేసుకున్న అతను ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి సుమారు రూ.2.30 లక్షల వరకు తీసుకున్నాడు. అనంతరం అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, సెల్‌ఫోన్‌ నెంబరు కూడా మార్చడంతో మోసపోయానని తెలుసుకున్న ప్రియాంక గత మార్చిలో అమింజికరై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ క్రమంలో తూత్తుకుడి సమీపం శ్రీవైకుంఠంకు చెందిన హిజ్రా యువశ్రీ అలియాస్‌ ముత్తులక్ష్మి వారం రోజుల క్రితం ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్య చేసుకోవడాన్ని ముత్తులక్ష్మి సెల్ఫీ తీసి వాట్సప్‌లో పోస్ట్‌ చేసింది. చెన్నై అమింజికరైలో ప్రియాంకను మోసం చేసిన మహమ్మద్‌ హుస్సేన్‌ ఆరు నెలల క్రితం ముత్తులక్ష్మిని వివాహం చేసుకొన్నాడని తెలిసింది. 

యువశ్రీ తీసుకున్న ఇంటి రుణానికి సంబంధించి ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసుల విచారణలో తేలింది. తనను మానసికంగా, శారీరకంగా మహమ్మద్‌ హుస్సేన్‌ హింసించాడని ముత్తులక్ష్మి తన మరణ వాంగ్మూలంలో తెలిపినట్టు సమాచారం