కోయంబత్తూరు: మరుగుదొడ్డిలో తల్లిని రెండు వారాలల పాటు బందించాడు ఓ కొడుకు. ఆమెను పోలీసులు రక్షించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఓమలూరులోని దాల్మియా బోర్డు ప్రాంతంలోని ఓ ప్లాటు మరుగుదొడ్డి నుండి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని మరుగుదొడ్డిలో ఉన్న  వృద్దురాలిని చూసి షాకయ్యారు.  వెంటనే వారు సంక్షేమశాఖాధికారులకు సమాచారం అందించారు. వారు ఆమెను రక్షించారు. 

వృద్దురాలి పేరు రాధగా గుర్తించారు. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. భర్త మరణించడంతో  పెన్షన్ అందకుండా చిన్న కొడుకు ఆమెను మోసగించాడని బాధితురాలు ఆరోపిస్తోంది. అంతేకాదు ఆమె బాగోగులు పట్టించుకోకుండా మరుగుదొడ్డిలో ఉంచాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి బాగోగులు చూసేందుకు స్వచ్ఛంధ సంస్థకు అప్పగించారు. బాధితురాలికి భోజనం అందించిన తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించనున్నట్టుగా స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు  బాధితురాలి కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.