దొంగ బాబాల మాయమాటలు నమ్మి ఓ యువకుడు సజీవ సమాధికి సిద్ధపడ్డాడు. ఆరడుగుల గోతిలో సమాధయ్యాడు. సమయానికి విషయం తెలియడంతో పోలీసులు అతడిని రక్షించారు.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందుతున్న మూఢనమ్మకాలు మాత్రం వదలడం లేదు. కొందరు దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు చెప్పే మాయమాటలు గుడ్డిగా నమ్ముతున్నారు. వారి మాయలో పడి కొందరుయువకులు నిండు జీవితాలను ఫణంగా పెడుతున్నారు. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్వామీజీలు, బాబాలు చెప్పిన మాయమాటలతో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు ఓ యువకుడు. అయితే పోలీసుల రంగ ప్రవేశంతో కథ సుఖాంతమైంది.
ఉత్తరప్రదేశ్ లోని తాజ్ గ్రామానికి చెందిన ముగ్గురు పూజారులు ఓ యువకుడిని మాయమాటలతో నమ్మించారు. మనం మనల్ని ఆత్మార్పణం చేసుకుంటే దేవుడు కనిపిస్తాడు అని నమ్మించారు. అది కూడా దేవీ నవరాత్రులకు ముందే జరిగిపోవాలని హడావుడి చేశారు. దీంతో ఆరడుగుల గొయ్యి తవ్వి, అందులో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు శుభమ్ గోస్వామి అనే యువకుడు. గొయ్యిపైన వెదురు బొంగులతో కప్పేసి, దానిపైన మట్టిని పూడ్చారు. ఆ తర్వాత గొయ్యిలోకి వెళ్ళిపోయాడు ఆ యువకుడు.
శివుడు పిలుస్తున్నాడు.. ఈ పాడు సమాజంలో ఉండొద్దన్నాడు.. యువకుడు ఆత్మహత్య..
అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని సమాధి నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ యువకుడిని ప్రశ్నించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఊరికి దూరంగా గుడిసె వేసుకుని అక్కడే ఐదారేళ్లుగా ఉంటున్నట్లు ఆ యువకుడు చెప్పాడు. శివకేశవ్, దీక్షిత్, మున్నాలాల్ అనే పూజారులతో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడినట్లు తెలిపాడు. సజీవ సమాధి అయితే జ్ఞానోదయం అవుతుందని, ఈ పనిని దేవీ నవరాత్రులు ప్రారంభం కావడానికి ముందే చేస్తేనే ఫలితం ఉంటుందని తెలిపారు. దీంతో సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యానని పోలీసులకు ఆ యువకుడు తెలిపాడు.
ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగగా.. గమనించిన గ్రామస్తులు వెంటనే ఈ విషయం పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు సమయానికి అక్కడికి వెళ్లడంతో ముప్పు తప్పింది. సమాధిని త్రవ్వి దానిపై నుంచి వెదురు బొంగులని తీసేసి యువకుడిని రక్షించారు. పోలీసులు నిందితులైన మున్నాలాల్, శివకేశవ్, దీక్షిత్ అనే ముగ్గురు పూజారులతో పాటు సమాధికి సిద్ధమైన యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటివారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నారు.
