రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఓ మహిళ మీద ఇప్పుడు కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ముంబై : కొన్నిసార్లు పోలీసులు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన కేసుల్లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయంటే.. పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటాయి. తమ మీద నేరం పడకుండా ఉండడానికి నిందితులు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. పక్కా ప్లాన్ చేస్తుంటారు. వీటివల్ల కొన్నిసార్లు పోలీసులు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుంటారు. అలాంటి ఘటనల్లో కొన్నిసార్లు పోలీసులు నమోదు చేసే కేసులు కూడా విచిత్రంగా ఉంటుంటాయి. 

అలాంటి ఓ విచిత్రమైన కేసు ముంబైలో వెలుగు చూసింది. ఓ మహిళ చనిపోయిన రెండేళ్ల తర్వాత ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త స్థానికంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. అసలు ఇంతకీ ఆ మహిళ చేసిన నేరమేమిటి.. ? చనిపోయిన రెండేళ్ల తర్వాత పోలీసులు కేసులు ఎందుకు ఫైల్ చేయాల్సి వచ్చింది?… దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

26 కిలోల టమాటాలు చోరీ.. కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

ఈ ఘటన రెండేళ్ల క్రితం ముంబై శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. ముంబై శివార్లలోని నయానగర్ ప్రాంతానికి చెందిన నస్రీన్ అనే 47 ఏళ్ల మహిళ 2021 సెప్టెంబర్ లో చనిపోయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. సద్నాజ్ (20), హర్ష్ (30). వీరు ముగ్గురు 2021 సెప్టెంబర్ 7వ తేదీన ఇంట్లో శవాలుగా కనిపించారు. ఈ సమాచారం పోలీసులకు అందడంతో వెంటనే ఘటనా స్థలాన్ని వెళ్లి పరిశీలించారు. ఆ తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

పోస్టుమార్టం నివేదికలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు పోలీసులను అవాక్కయ్యేలా చేశాయి దీంతో చనిపోయిన ఆ మహిళ మీద కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆ పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే నస్రీన్ తన పిల్లల గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత తాను నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఈ శవ పరీక్ల నివేదికల ఆధారంగానే మంగళవారంనాడు పోలీసులు చనిపోయిన నస్రీన్ పై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. 

అయితే ఈ ఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా నస్రీన్ తన పిల్లలను అంత దారుణంగా చంపేసి, తాను ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇంకా తెలియ రాలేదు. దీనికోసమే కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. త్వరలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు చెబుతామన్నారు. మరోవైపు ఈ చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ట్రోల్ చేస్తున్నారు.