పరుగుల రాణి పీటీ ఉషపై (PT Usha) పోలీసు కేసు నమోదైంది. మరో మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ (Jemma Joseph) ఫిర్యాదు మేరకు కేరళలోని కోజికోడ్ పోలీసులు (Kozhikode Police) పీటీ ఉషపై కేసు నమోదు చేశారు.

పరుగుల రాణి పీటీ ఉషపై (PT Usha) పోలీసు కేసు నమోదైంది. మరో మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ (Jemma Joseph) ఫిర్యాదు మేరకు కేరళలోని కోజికోడ్ పోలీసులు (Kozhikode Police) పీటీ ఉషపై కేసు నమోదు చేశారు. పీటీ ఉష‌తో పాటు మరో ఆరుగురిపై పోలీసులు చీటింగ్‌కు సంబంధించి ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదైంది. ఇంటి నిర్మాణం కోసం తాను కొంత మొత్తం చెల్లించానని.. కానీ తనకు హామీ ఇచ్చిన గడువులోగా ఇళ్లు పూర్తి కాలేదని జెమ్మా జోసెఫ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు అందడటంతో.. కోజికోడ్ పోలీసు చీఫ్ ఏవీ జార్జ్‌కు వివరణాత్మక విచారణ కోసం పంపారు. ఇందుకు సంబంధించి శుక్రవారం కేసు నమోదైందని, త్వరలోనే విచారణ ప్రారంభిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. 

కోజికోడ్‌లో ఓ ఫ్లాట్ కోసం వాయిదాల రూపంలో పిటి ఉషకు మొత్తం రూ. 46 ల‌క్ష‌లు చెల్లించినట్టుగా జెమ్మా జోసెఫ్ పేర్కొన్నారు. పీటీ ఉష హామీ మేర‌కే బిల్డ‌ర్‌కు డ‌బ్బులు చెల్లించాన‌ని, కానీ ఫ్లాట్ ఇవ్వ‌డంలో జాప్యం జ‌రుగుతోంద‌ని జోసెఫ్ చెప్పారు. నిర్ణీత గడువులో ఫ్లాట్ తనకు అప్పగించలేదని, తిరిగి డబ్బులు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు సంబంధించి బిల్డర్‌ను సంప్రదించగా.. డబ్బులు తిరిగి చెల్లించేందుకు పీటీ ఉష బాధ్యత వహించాలని చెప్పినట్టుగా జెమ్మా జోసెఫ్ పేర్కొన్నారు. అయితే తనకు పీటీ ఉష డబ్బులు తిరిగి ఇవ్వలేదని.. పీటీ ఉష, బిల్డర్‌ తనను మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు పీటీ ఉష‌తో పాటు నిర్మాణ సంస్థకు చెందిన మరో ఆరుగురికి కేసు నమోదు చేశారు. 

ఇక, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు జెమ్మా జోసెఫ్ ఇందుకు సంబంధించి.. బిల్డర్లపై నిఘా ఉంచే కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని కూడా సంప్రదించారు.