మోడీ సభ.. ‘నల్లరంగు’ దుస్తులపై పోలీసుల క్లారిటీ

Police Officials clarity on People Wearing Black Clothes in PM Modi meeting in Jaipur
Highlights

ప్రధాని మోడీ సభకు నల్ల రంగు దుస్తులు వేసుకొస్తున్న ప్రజలను అరెస్ట్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై పోలీసు ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. ప్రజలు ఇష్టమైన దుస్తులు వేసుకొవచ్చని.. కాకపోతే నల్లజెండాలు వెంట తీసుకెళ్లేవారిని మాత్రం వదిలిపెట్టబోమని వారు తెలిపారు.
 

ప్రధాని నరేంద్రమోడీ సభ సందర్భంగా రాజస్థాన్ పోలీసులు చేస్తున్న అతి ప్రభుత్వానికి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ జైపూర్‌లో భారీ బహిరంగసభను తలపెట్టింది. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ప్రతిపక్ష పార్టీలు ఆటంకం కలిగించకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే సభలో కొందరు ఆందోళనకారులు నల్లరంగు జెండాలతో నిరసన తెలిపే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా నలుగు రంగు కనిపిస్తే చాలు కంగారుపడిపోతున్నారు.. నల్లరంగు దుస్తులు వేసుకున్న ఎవరిని సభా ప్రాంగణంలోకి అనుమతించడం లేదు. పోలీసుల ఓవరాక్షన్‌పై ప్రజలు, వివిధ పార్టీల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు..‘ ప్రజలు నిరభ్యంతరంగా నల్లరంగు దుస్తులు ధరించవచ్చని.. కాకపోతే నల్లజెండాలు తీసుకుని వచ్చే వారిని సభా ప్రాంగణంలోకి అనుమతించబోమని.. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.’ కాగా, మోడీ సభ ఏర్పాట్ల కోసం రాజస్థాన్ ప్రభుత్వం రూ.7.23 కోట్లు ఖర్చు చేయడం.. ప్రధానితో ముచ్చటించే మహిళలకు ట్రైనింగ్ ఇచ్చారన్న వార్తలు విమర్శలకు తావిచ్చాయి.
 

loader