కేరళలో సంచలనం సృష్టించిన  ఆర్ఎస్ఎస్ నేత ఎస్‌కే శ్రీనివాసన్ హత్య కేసును విచారిస్తున్న పోలీస్ అధికారి అనిల్ కుమార్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. దర్యాప్తు నుంచి తప్పుకోకుంటే నిన్నూ చంపేస్తామని వారు హెచ్చరించారు. 

దేశంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సైతం ఆగంతకుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. తాజాగా కేరళలో ఓ హత్య కేసును విచారిస్తున్న పోలీస్ అధికారి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్ఎస్ఎస్ నేత ఎస్‌కే శ్రీనివాసన్ దారుణహత్యకు గురికావడం కేరళలో కలకలం రేపింది. పాలక్కాడ్‌లోని తన మొబైల్ షాపులో వుండగా ఆరుగురు ఆగంతకులు ఆయనపై కత్తులు, ఇతరు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కేరళ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి అనిల్ కుమార్ అనే సీనియర్ అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అనిల్ కుమార్.. విచారణలో దూకుడుగా వ్యవహరిస్తూ ఇప్పటికే కీలకమైన సమచారాన్ని సేకరించారు. 

Also Read:లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు... ఫడ్నవీస్ భార్యకు వై ప్లస్ సెక్యూరిటీ

ఈ నేపథ్యంలో గత శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి .. శ్రీనివాసన్ హత్య కేసు విచారణ నుంచి తప్పుకోవాలని హెచ్చరించాడు. లేనిపక్షంలో తనను కూడా చంపేస్తామని చెప్పారని, శవపేటికను సిద్ధం చేసుకోవాల్సిందిగా హెచ్చరించారని అనిల్ కుమార్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బెదిరింపులకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు.