బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరో సారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రజలు ఆకస్మికంగా దాడి చేస్తే పోలీసులు ఎవరూ రారని అన్నారు. అందుకే ఎవరికి వారు ఆయుధాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తూ ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్ట్ చేశారు.
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ తాజాగా మరో సారి రెచ్చిపోయారు. మే 2013లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన నిరసన సందర్భంగా తీసిన ఫొటోను ఫేస్ బుక్ లో షేర్ చేస్తూ వివాదాస్పదంగా పోస్టు పెట్టారు. ముస్లింల దాడికి హిందువులు సిద్ధంగా ఉండాలని కోరారు. ఇంట్లో కూల్ డ్రింక్స్ సీసాలు, బాణాలను ఉంచుకోవాలని సూచించారు.
“ ఈ గుంపు అకస్మాత్తుగా మీ వీధికి లేదా మీ ఇంటికి వస్తే, వారిని ఆపడానికి మీకు ఏదైనా మార్గం ఉందా ! లేకపోతే ఇప్పుడు సిద్ధంగా ఉండండి. పోలీసులు మిమ్మల్ని రక్షించడానికి రారు. తమను తాము రక్షించుకోవడానికి ఎక్కడో దాక్కుంటారు” అని హిందీలో ఆయన ఫేస్‌బుక్‌లో రాశారు. పోలీసులు రక్షించడానికి రారని, కానీ వారిని వారు రక్షించుకోవడానికి ఏదైనా షెల్టర్‌లో దాక్కుంటారని అన్నారు. ఇంతమంది జిహాద్ చేసి తిరిగి వెళ్లిన తరువాత పోలీసులు కొట్టడానికి లాఠీలు తీసుకొని వస్తారని అన్నారు. కొన్ని రోజుల తరువాత ఈ ఘటన విచారణ కమిటీకి వెళ్లి ముగిసిపోతుందని అన్నారు. అలాంటి అతిథుల కోసం రెండు బాక్సుల కూల్ డ్రింక్ సీసాలు, కొన్ని అసలైన బాణాలు ప్రతీ ఇంట్లో ఉండాలని పేర్కొన్నారు.
బీజేపీ నాయకుడు సాక్షిమహారాజ్ ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఈయన బీజేపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ఇటీవల ఢిల్లీలోని జహంగీర్ పూరి లో జరిగిన హింసాకాండపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన రాళ్ల దాడిలో ప్రతిపక్షాల హస్తం ఉందని ఆరోపించారు. ఈ దాడి కోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, చత్తీస్ ఘడ్ సీఎం గెహ్లాట్ ఎప్పటి నుంచో ప్లాన్ చేశారని అన్నారు. సాక్షి మహారాజ్ గతంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఖలిస్తానీ ఉగ్రవాదులుగా అభివర్ణించారు.
ఇటీవల ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన మత ఘర్షణలో నేపథ్యంలో సాక్షి మహారాజ్ ఈ పోస్టు చేశారు. ఈ పోస్టులో ఆయన షేర్ చేసిన ఫొటో 2013 మే నెలలో తీసింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన నిరసన సందర్భంగా తీసిన ఈ ఫొటోలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో కర్రలు పట్టుకొని వస్తున్నట్టు కనిపిస్తున్నారు.
