యూపీలో ఓ జర్నలిస్టుపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు.  రాత్రంతా పోలీసు కస్టడీలో ఉంచి తీవ్రంగా కొట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అయితే జర్నలిస్టు చెప్పేదంతా అబద్దమని పోలీసులు తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఆగ్రా (Agra) జిల్లాలో పోలీసులు త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని ఓ 39 ఏళ్ల‌ జర్నలిస్టు ( journalist) తీవ్రంగా ఆరోపించారు. రాత్రంతా స్టేష‌న్ లో చిత్రహింస‌ల‌కు గురి చేశార‌ని తెలిపారు. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను పోలీసు అధికారులు ఖండించారు. అదంతా అబ‌ద్ద‌మ‌ని చెబుతున్నారు. 

ఇటీవ‌ల యూపీలో జ‌రిగిన ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా పోలీసు అధికారుల‌తో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో గౌర‌వ్ బ‌న్సాల్ (Gaurav Bansal) అనే జ‌ర్న‌లిస్టును అరెస్టు చేశారు. ఆయ‌న‌పై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేసిన పోలీసు అధికారి ప్ర‌కారం.. మార్చి 8 న జ‌ర్న‌లిస్టు బన్సాల్ కౌంటింగ్ కేంద్రానికి ఓ 10-15 మందితో చేరుకున్నారు. అయితే ఓటింగ్ సామగ్రిని మారుస్తున్నార‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రారంభించారు. 

జ‌ర్న‌లిస్టు ఈ పుకార్ల‌ను వ్యాప్తి చేయ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లంలో జనం గుమిగూడడం ప్రారంభించారు. దీంతో ప‌రిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకురాలేక‌పోయారు. దీంతో మ‌రింత పోలీసు బ‌ల‌గాల‌ను అక్క‌డికి పిల‌వాల్సి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో ఆ జ‌ర్న‌లిస్టు అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించాడు. పోలీసు సిబ్బంది ప‌ట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఫలితంగా వారికి గాయాలయ్యాయి. ఆ జ‌ర్న‌లిస్టు అధికారుల ప‌నిని అడ్డుకున్నాడు. కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో అత‌డిపై మార్చి 9వ తేదీన ఎత్మద్దౌలా స్టేష‌న్ లో కేసు న‌మోదు చేశార‌ని అని పోలీసులు తెలిపారు. 

అయితే జర్న‌లిస్టు త‌రుఫు న్యాయ‌వాది అధర్ శర్మ (Adhar Sharma) పోలీసులు తెలిపిన వివ‌రాల‌ను ఖండించారు. బన్సాల్ జర్నలిస్ట్‌గా తన పనిని నిర్వ‌ర్తించినందుకు ఆయ‌న‌ను టార్గెట్ చేశార‌ని తెలిపారు. జ‌ర్న‌లిస్టుపై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని, ఆయ‌న‌ను అవ‌మానించార‌ని శ‌ర్మ తెలిపారు. బన్సల్‌ను అరెస్టు చేసిన తర్వాత మార్చి 15న పోలీసులు రాత్రంతా నిర్దాక్షిణ్యంగా కొట్టారని లాయర్ పేర్కొన్నారు. ఆ జర్న‌లిస్టు బన్సల్ పంజాబ్ కేసరి (Punjab Kesari) వార్తాపత్రికకు రిపోర్టర్‌గా పనిచేస్తున్నారని న్యాయవాది తెలిపారు.