ఆ యువకుడు చెన్నై నుంచి తన స్వగ్రామానికి ఆనందంగా వచ్చాడు. అయితే... చెన్నైలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. పరీక్ష చేయించుకోకుండా ఇంట్లోకి రావడానికి వీలులేదంటూ కుటుంబసభ్యులు కండిషన్ పెట్టారు. దీంతో.. సదరు యువకుడు ఓ లారీ చోరీ చేసి మరీ.. కరోనా పరీక్షకు వెళ్లాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కూత్తానల్లూరు సమీపంలోని పులియంకుడి నడి వీధికి చెందిన తంగరాజ్‌ కుమారుడు అశోక్‌ (25) చెన్నైలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ నడుస్తుండటంతో స్వగ్రామానికి చేరుకున్నాడు. సరుకు లారీల ద్వారా తిరుత్తురై పూండికి వచ్చిన అతను అక్కడున్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా కరోనా భీతి కారణంగా అతన్ని బంధువులు ఇంట్లోకి అనుమతించలేదు.

వెంటనే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా బంధువులు అతనిపై ఒత్తిడి తెచ్చారు. అతను అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుత్తురైపూండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయాలని కోరాడు. అక్కడున్న వైద్యులు ఉదయాన్నే పరీక్షలు జరుపుతామని చెప్పారు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలంటే తిరువారూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి వెళ్లాలని చెప్పడంతో అక్కడ రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అశోక్‌ లారీని చోరీచేసి ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిసింది. 

కాగా.. లారీ చోరీకి గురయ్యిందని యజమాని ఫిర్యాదు చేయగా.. దాని కోసం గాలిస్తుండగా ఈ విషయం తెలిసింది. దీంతో యువకుడిని నాగపట్టణం పోలీసులు అరెస్ట్‌ చేసి సబ్‌ జైలుకు తరలించారు.