Asianet News TeluguAsianet News Telugu

స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ చైత‌న్యాన్ని త‌ట్టిలేపిన క‌వి ‘రవీంద్ర‌నాథ్ ఠాగూర్’

భారత స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో దేశ ప్రజల్లో జాతీయతా భావాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ తన రచనలతో, గేయాలతో తట్టిలేపారు. గీతాంజలి రచనకు నోబుల్ బహుమతి అందుకున్నారు. పలు సందర్భాల్లో బ్రిటీష్ అధికారుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు.

Poet 'Rabindranath Tagore' who raised national consciousness in freedom struggle
Author
New Delhi, First Published Aug 5, 2022, 1:48 PM IST

రవీంద్రనాథ్ ఠాగూర్.. ఈ పేరు తెలియ‌ని భార‌తీయుడు లేరంటే అతిష‌యోక్తి కాదేమో.. సాహిత్యంలో నోబుల్ బ‌హుమ‌తి పొందిన మొద‌టి భార‌తీయుడు ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్. అత‌డి ర‌చ‌న‌లు మెచ్చుకునేవారు. ఆయ‌న బ‌హుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. గొప్ప సాహితీవేత్త‌గా, చిత్ర‌కారుడిగా, సంగీత‌కారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విశ్వకవిగా ప్రసిద్ధిగాంచారు.  

స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ చైతన్యాన్ని రూపొందించడంలో ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ కీలక పాత్ర పోషించారు. 1913 సంవత్సరంలో రవీంద్ర నాథ్ ఠాగూర్ తన కవితా రచన ‘గీతాంజలి’కి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి భారతీయుడు, అలాగే మొదటి యూరోపియనేతరుడు కూడా ఆయ‌నే. దేబేంద్రనాథ్ ఠాగూర్, శారదా దేవి దంపతులకు పదమూడు మంది సంతానంలో చిన్నవాడైన రవీంద్ర నాథ్ ఠాగూర్ 1861 మే 7న జన్మించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తన ప్రాథ‌మిక విద్య‌ను ఇంట్లోనే పొందినప్పటికీ, అతడు త్వరలోనే సాహిత్య ప్రతిభను పెంపొందించుకున్నారు. ఉన్నత స్థాయికి చెందిన కవి, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఠాగూర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అయినప్పటికీ  ఆయ‌న క‌విత్వంలో అధిక ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చారు. రవీంద్రనాథ్ రాసిన కవితా సంకలనం గీతాంజలి 1910లో ప‌బ్లిష్ అయ్యింది. ఇది సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని గెలుచుకుంది. ఠాగూర్ అనేక ఇతర ముఖ్యమైన రచనల్లో  మానసి (1890), సోనార్ తారి (1894), గితిమాలయ (1914), రాజా (1910), పోస్టాఫీసు (1912) మొదలైనవి ఉన్నాయి.  రవీంద్రనాథ్ ఠాగూర్ అనుభవజ్ఞుడైన చిత్రకారుడు కూడా. ఆయ‌న అనేక విలువైన చిత్రాలను గీశారు. ఆయ‌న‌కు సంగీతంపై ఆసక్తి ఉండడంతో కొన్ని పాటలు రాసి వాటికి సంగీతం కూడా అందించారు.

జాతీయ స్వాతంత్య్రోద్యంలో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ త‌న వంతు పాత్ర పోషించారు. రవీంద్ర నాథ్ ఠాగూర్ బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా అత‌డికి బ్రిటీష్ అధికారులు ఇచ్చిన ‘నైట్‌హుడ్’ బిరుదును కూడా తిరిగి ఇచ్చేశారు. జాతీయ భావాలు అధికంగా ఉన్న ర‌వీంద్రుడు అనేక హిందూ మేళాలో దేశ భ‌క్తి గీతాల‌ను పాడేవారు. త‌న పాటల ద్వారా జాతీయ‌త చైత‌న్యాన్ని త‌ట్టిలేపేవారు. ఆ గీతాలను ప్ర‌చారం చేసేవారు. బ్రిటీష‌ర్లు బాల గంగాధ‌ర్ తిల‌క్ ను బంధించిన‌ప్పుడు తీవ్రంగా వ్య‌తిరేకించారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని విమ‌ర్శించారు. బెంగాల్ విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించారు. దానికి వ్య‌తిరేకంగా జ‌రిగిన ఉద్య‌మంలో ముఖ్య పాత్ర పోషించారు. 

రవీంద్రనాథ్ ఠాగూర్ పిల్లల కోసం శాంతినికేతన్ అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దీనిని విశ్వభారతి విశ్వవిద్యాలయం అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ప్రాచీన గురుకుల విద్యను అందించేవారు. ఇప్పుడు మ‌నం జాతీయ గీతంగా పిలుచుకునే ‘జనగణమణ’ను ఆయ‌నే ర‌చించారు. ఆయ‌న ‘వందేమాత‌రం’ గేయాన్ని 1896లో జ‌రిగిన కాంగ్రెస్ స‌ద‌స్సులో తొలిసారిగా ఆల‌పించాడు. దీనిని బక్రించంద్ర చ‌ట‌ర్జీ ర‌చించారు. అయితే స్వాతంత్య్ర అనంత‌రం ఈ రెండింటిలో దేనిని జాతీయ గీతంగా ప్ర‌క‌టించాల‌ని పెద్ద చ‌ర్చ జ‌రిగింది. కానీ 1950 సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 24వ తేదీన ‘జనగణమణ’ను జాతీయ గీతంగా ప్రకటించారు. అలాగే ‘వందేమాతరం’ను దానిని సమాన హోదాతో జాతీయ గేయంగా ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios