ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ:భారత్ ను హత్య చేశారని తాను అనలేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు.శుక్రవారంనాడు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.మణిపూర్ ను హత్య చేశారు...రెండుగా చీల్చారని తాను వ్యాఖ్యానించినట్టుగా రాహుల్ గాంధీ గుర్తు చేశారు. మణిపూర్ ను , భారత్ ను బీజేపీ హత్య చేసింది అన్నదే తన మాటల ఉద్దేశ్యంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మణిపూర్ లో హింస జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోయారని ప్రధాని మోడీని ప్రశ్నించారు. . దేశంలో ఇంత జరుగుతుంటే ప్రధాని రెండు గంటల పాటు టైంపాస్ చేశారని ఆయన ఎద్దేవా చేశారు.నిన్న నవ్వుతూ కన్పించిన ప్రధాని దేశంలో ఏం జరుగుతుందో తెలియదా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.ఈ వ్యవహారశైలి సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.మణిపూర్ మండుతుంటూ ప్రజలు చనిపోతుంటే ప్రధానమంత్రి నవ్వుతూ కన్పించారన్నారు.మణిపూర్ ఇష్యూను తమాషాగా మార్చారని ఆయన ప్రధాని తీరుపై మండిపడ్డారు.
సైన్యానికి అవకాశం ఇస్తే రెండు రోజుల్లో మణిపూర్ లో పరిస్థితిని చక్కదిద్దుతారని ఆయన అభిప్రాయపడ్డారు.మణిపూర్ లో దారుణ పరిస్థితులను చూసి కేంద్ర దళాలే ఆశ్చర్యపోయాయని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. నిప్పుల గుండంలాంటి మణిపూర్ ను చల్లార్చకుండా మరింత ఆజ్యం పోసిందని ఆయన బీజేపీపై మండిపడ్డారు.మణిపూర్ కు వెళ్లి స్థానికులతో మాట్లాడొచ్చు కదా అని ఆయన ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. స్థానికులకు భరోసా కల్పించాల్సి ఉండేదన్నారు. కానీ ప్రభుత్వం వైపు నుండి ఈ దిశగా ఎలాంటి చర్యలు కన్పించడం లేదని రాహుల్ చెప్పారు.
also read:పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: లోక్‌సభ నిరవధిక వాయిదా
పార్లమెంట్ నుండి విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు.అధికార పక్షం విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసినా తమ పని మారదన్నారు. మణిపూర్ లో హింసను అరికట్టడమే తమ పని ఆయన స్పష్టం చేశారు.మణిపూర్ లో హింసను అరికట్టేందుకు ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు.
తాను గత 19 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించానన్నారు. కానీ మణిపూర్ లో జరిగిన ఘటనను ఎక్కడా చూడలేదన్నారు. మణిపూర్ లో రెండు గిరిజన తెగల మధ్య విభజన రేఖ కన్పించిందన్నారు. మణిపూర్ లో తాను చూసిన అంశాలనే పార్లమెంట్ లో ప్రస్తావించినట్టుగా రాహుల్ గాంధీ వివరించారు. ఆర్మీ రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తుందన్నారు. అయితే తాను ఆర్మీ జోక్యాన్ని కోరడం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
