లోక్‌సభ శుక్రవారం నాడు నిరవధికంగా వాయిదా పడింది.


న్యూఢిల్లీ: లోక్‌సభ శుక్రవారంనాడు నిరవధికంగా వాయిదా పడింది. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ పై సస్పెన్షన్ పై విపక్షాలు ఇవాళ లోక్ సభ ప్రారంభం కాగానే నిరసనకు దిగాయి. విపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైంది.

సభ ప్రారంభం కాగానే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి జీఎస్‌టీ సవరణ బిల్లు 2023, ఇంటిగ్రేటేడ్ గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లు 2023 లను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సమయంలో విపక్షాలు తమ నిరసనను కొనసాగించారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఐపీసీ, క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో బిల్లులను ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుల గురించి సభలో కేంద్ర హోంశాఖ మంత్రి వివరించారు. ఈ సమయంలో విపక్షాలు సభలో లేవు. అంతకు ముందే సభ నుండి విపక్ష సభ్యులు లోక్ సభ నుండి వాకౌట్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఏడాది జూలై 20వ తేదీన ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి మణిపూర్ హింస విషయమై లోక్ సభలో ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి.