Asianet News TeluguAsianet News Telugu

విదేశీ సాంకేతికతతో వేగంగా ఇళ్ల నిర్మాణం: లైట్‌హౌస్ ప్రాజెక్ట్‌ల పురోగతిని సమీక్షించిన మోడీ

దేశవ్యాప్తంగా లైట్‌హౌస్‌ల పురోగతిని ప్రధాని నరేంద్రమోడీ డ్రోన్‌ల ద్వారా సమీక్షించారు. ఈ ఏడాది జనవరి 1న లైట్‌హౌస్ ప్రాజెక్ట్‌లను ప్రధాని ప్రారంభించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేయడానికి ఈ లైట్‌హౌస్ ప్రాజెక్ట్‌లకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 

PM reviewed the progress of housing projects by VC ksp
Author
New Delhi, First Published Jul 3, 2021, 7:13 PM IST

దేశవ్యాప్తంగా లైట్‌హౌస్‌ల పురోగతిని ప్రధాని నరేంద్రమోడీ డ్రోన్‌ల ద్వారా సమీక్షించారు. ఈ ఏడాది జనవరి 1న లైట్‌హౌస్ ప్రాజెక్ట్‌లను ప్రధాని ప్రారంభించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేయడానికి ఈ లైట్‌హౌస్ ప్రాజెక్ట్‌లకు కేంద్రం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా దేశంలోని 6 ప్రాంతాల్లో లైట్‌హౌస్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. 

ఉదాహరణకు ఇండోర్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌కు ఇటుక, మోర్టార్ గోడలు వుండవు. వీటికి బదులుగా ముందుగా తయారు చేసిన శాండ్ విచ్ ప్యానెల్‌లను ఉపయోగిస్తారు. రాజ్‌కోట్‌లోని లైట్‌హౌస్ ప్రాజెక్ట్ ఫ్రెంచ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మిస్తున్నారు. ఇక్కడ ఒక సొరంగం తవ్వి.. మోనోలితిక్ కాంక్రీట్ సాయంతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవి ఎలాంటి విపత్తులనైనా తట్టుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. 

లక్నోలో కెనడా సాంకేతికతను వినియోగిస్తున్నారు. దీనికి ప్లాస్టర్, పెయింట్ అవసరం లేదు. ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గోడలను ఉపయోగిస్తారు. చెన్నైలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌కు అమెరికా, ఫిన్‌లాండ్ టెక్నాలజీలతో ప్రీకాస్ట్ కాంక్రీట్‌ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ఇల్లు వేగంగా నిర్మించడంతో పాటు చౌకగా పూర్తవుతుంది. 

రాంచీ ప్రాజెక్ట్‌లో జర్మనీ 3డీ నిర్మాణ వ్యవస్థను ఉపయోగించి ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రతి గది విడివిడిగా తయారు చేస్తారు. అనంతరం మొత్తం నిర్మాణాన్ని లెగో బ్లాక్స్ బొమ్మల మాదిరిగా ఒకదానికి మరొక దానిని అనుసంధానం చేస్తారు. ఎంత పెద్ద భూకంపాన్నైనా తట్టుకోగల న్యూజిలాండ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్టీల్ ఫ్రేమ్‌లతో అగర్తలాలో ఇళ్లు నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఆయా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వేలాది ఇళ్లు వేగంగా నిర్మించబడతాయి. తద్వారా బిల్డింగ్ ప్లానర్లు, వాస్తు శిల్పులు, ఇంజనీర్లు, విద్యార్ధులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంతో పాటు ఈ రంగంలో ప్రయోగాలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios